రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని.. సాక్షాత్తూ హైకోర్టు ప్రశ్నిస్తే.. తెలంగాణ పోలీసులు చేతులు పిసుక్కున్నారు.. నీళ్లు నమిలారు.. ఏం చెప్పాలో తెలియక..తికమక పడ్డారు. బంద్ కు పిలుపునిచ్చారని ఓ సారి .. అల్లర్లు జరుగుతాయని.. ఇంటలిజెన్స్ నివేదిక వచ్చిందని మరోసారి హైకోర్టుకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు వదిలి పెట్టలేదు. చివరికి ఇంటలిజెన్స్ నివేదిక వచ్చిందంటూ హైకోర్టులో వాదించారు అప్పుడూ హైకోర్టు వదిలి పెట్టలేదు. ఆ ఇంటలిజెన్స్ నివేదిక తెప్పించాలని స్పష్టం చేశారు. ఓ సారి పది నిమిషాలు..మరోసారి గంట సమయం ఇచ్చినా.. పోలీసులు .. ఇంటలిజెన్స్ ఇచ్చినట్లు చెబుతున్న నివేదికను తీసుకు రాలేకపోయారు. టెక్నాలజీ ఇంత పెరిగిన తరవాత నివేదికను ఎంపుకు తెప్పించలేకపోయారని.. హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేవంత్ ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో బుధవారం హైకోర్టుకు తెలిజేస్తామంటూ ఏజీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అప్పటికే రేవంత్ ను విడుదల చేసినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఏజీ వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుని…బుధవారానికి హైకోర్టు విచారణను వాయిదా వేసింది. కోస్గిలో సభ ముగిసే సమయానికి.. పోలీసులు.. రేవంత్ రెడ్డిని .కొడంగల్ తీసుకచ్చి విడిచి పెట్టారు. నిజంగా ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చి ఉంటే… ఆ కాపీని మెయిల్ లో తెప్పించడం నిమిషం పని. కానీ… ఆ పని చేయలేకపోయారు .. పోలీసులు. రేవంత్ ను.. పోలీసులు అరెస్ట్ చేసే టప్పుడు.. ఈసీ చెప్పిందని.. అందుకే తాము అరెస్ట్ చేయడానికి వచ్చామని రేవంత్ రెడ్డికి చెప్పడం.. వీడియోల్లో ఉంది.
మొత్తానికి రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం.. పోలింగ్ కు ముందు ఓ హాట్ టాపిక్ గా మారడం.. టీఆర్ఎస్ వర్గాలకు షాక్ ఇచ్చేలా ఉంది. ముందూ వెనుకా చూసుకోకుండా.. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని.. టీఆర్ఎస్ నేతలు చెలరేగిపోతున్నారని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారంతో దీనికి బలం చేకూరినట్లయింది.బుధవారం .. రేవంత్ రెడ్డి అరెస్టుకు సరైన కారణాలు చూపించలేకపోతే..హైకోర్టు వేసే అక్షింతలు మరింత మైనస్ అవుతాయి. మరో వైపు.. కోస్గి బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకు రాకుండా ప్రసంగం ముగించారు. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇస్తున్న హామీల్నే మళ్లీ ఇచ్చి.. నరేందర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.