నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె ఎగ్జిబిషన్ మైదానంలో దీక్ష చేపట్టాలనుకుని పోలీసుల పర్మిషన్ అడిగారు. వారు ఇవ్వలేదు. అయిన వైఎస్ఆర్ టీపీ నేతలు అక్కడే దీక్ష చేస్తారనిప్రకటించారు. సమయానికి షర్మిల బోడుప్పల్ వచ్చారు. కానీ అక్కడ ఏర్పాట్లేమీ లేకపోవడంతో ధర్నాకు దిగారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అనుచరులు అడ్డు పడటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
అంతకు ముందు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని పరామర్శించారు. కేసీఆర్పై షర్మిల తీవ్ర విమర్శలుచేశారు. కేసీఆర్ వందల మంది నిరుద్యోగుల ప్రాణాలు బలిగొన్న హంతకుడని మండిపడ్డారు. ఇతర ప్రతిపక్ష పార్టీలపైనా షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా నిద్రపోయిన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు గర్జనలు, పాదయాత్రలు అంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించలేదని విమర్శించారు. కేసీఆర్కు అమ్ముడుపోయిన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు దీక్షలు, గర్జనలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
దీక్ష లేకపోవడం..పోలీసులు అరెస్ట్ చేయడంతో దీక్ష కోసం తీసుకు వచ్చిన కొంత మంది కూలీలు ఆందోళనకు దిగారు. దీక్షలో కూర్చుంటే రూ. నాలుగు వందలు ఇస్తామని తీసుకు వచ్చారని కానీ ఇప్పుడు దీక్ష లేదని చెప్పి డబ్బులివ్వడం లేదని కూలీలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని పంపించి వేశారు. షర్మిలను మేడిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఇంటికి పంపేశారు.