హైదరాబాద్‌లో ఉన్న “ఐటీ గ్రిడ్” కంపెనీపై రాజకీయ కారణాలతో పోలీసులు దాడి చేసి సర్వర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకెళ్లడం.. కలకలం రేపుతోంది. నలుగురు ఉద్యోగుల్ని తీసుకెళ్లి సున్నితమైన సమచారాన్ని వెల్లడించాలని.. ఒత్తిడి చేయడం మరింతగా ఆందోళనకు గురి చేసే అంశంగా మారుతోంది. హైదరాబాద్ అంటేనే ఐటీ గుర్తుకు వస్తుంది. నిన్నామొన్నటి వరకు.. ఆ ఐటీ కంపెనీలన్నీ.. కాస్త భద్రంగానే ఉన్నాయి. ఒక్క రాత్రిలోనే … వాటిలో వణుకు ప్రారంభమయింది. “ఐటీ గ్రిడ్” కంపెనీ తరహా పరిస్థితి తమకు వస్తే.. అన్న ఆలోచన వారికి రావడమే దీనికి కారణం. ఈ మొత్తానికి టీఆర్ఎస్ ప్రభుత్వ అత్యుత్సాహమే కారణం.
“మద్యం దుకాణం”పై దాడి చేసినట్లు “ఐటీ కంపెనీ”పై దాడి చేస్తారా..?
హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీపై తెలంగాణ పోలీసులు అర్థరాత్రి విరుచుకుపడ్డారు. సమయం ముగిసిన తర్వాత మద్యం తాగుతున్న వారిని వెంటాడినట్లు. ఉద్యోగుల్ని వెంటాడారు. దొరికిన నలుగుర్ని పట్టుకుపోయారు. ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా.. ఈ కంపెనీ కొన్ని సేవలు అందిస్తుంది. అవి ఈ కంపెనీని కొన్ని క్లైంట్లు మాత్రమే. మరికొన్ని ప్రసిద్ధ సంస్థలు ఈ కంపెనీ సేవలు తీసుకునే జాబితాలో ఉన్నాయి. హఠాత్తుగా… ఈ కంపెనీ ఎదుట ప్రత్యక్షమైన తెలంగాణ పోలీసులు… వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు.. చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని విరుచుకుపడ్డారు. పదుల సంఖ్యలో పోలీసులు కార్యాలయంపై దాడి చేసి.. హార్డ్ డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుని ఇద్దరు ఉద్యోగుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు.. ఆ కంపెనీపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి. వాటికి ప్రాతిపదిక ఏమిటి అన్నదాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. తమకేదో .. రాజకీయ ఆదేశాలు ఉన్నట్లుగా.. వారి పని వారు చేసుకుపోయారు.
సమాచారం కోసం ఉద్యోగుల్ని కిడ్నాప్ చేసేస్తారా..?
ఓటర్ల డేటాకు సంబందించి.. విజయసాయిరెడ్డి కానీ.. లోకేశ్వర్ రెడ్డి కానీ ఎలాంటి ఆధారాలివ్వలేదు. కేవలం ఫిర్యాదు మాత్రమే చేశారు. సహజంగా.. ఓటర్ల లిస్ట్ రాజకీయ పార్టీలన్నింటికీ.. ఈసీ ఇస్తుంది. డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా. ఆ ఫ్లెక్సిబులిటీ ఈసీనే ఇచ్చింది. ప్రభుత్వ పథకాలు పొందిన వారి వివరాలు ఉన్నాయట. దానికి సంబంధించిన ఆధారం ఏమి ఉంది..? ప్రభుత్వ పథకాలు పొందిన లబ్దిదారులతో నేరుగా కాంటాక్ట్ అవడానికి.. వారికి ఎస్సెమ్మెస్‌లు పంపడానికి బ్లూఫ్రాగ్ అనే కంపెనీకి ప్రభుత్వం పని అప్పగించింది. అది అధికారికం. అది తప్పెలా అవుతుంది..?. ఏ విధంగా చూసినా… ఐటీ గ్రిడ్ కంపెనీపై పోలీసులు విరుచుకుపడటానికి అసలు కారణం వేరే ఉంది. అది టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్.. ఇతర సమాచారాన్ని తస్కరించడమేననేది.. గట్టిగా వినిపిస్తున్నమాట. పిక్ పాకెటర్లనీ… కేసుల్లో ఉన్న వారిని… రహస్యంగా వచ్చి తీసుకెళ్లిపోతూంటారు పోలీసులు. ఐటీ గ్రిడ్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పాపాన.. నలుగుర్ని పోలీసులు అదే గాటన కట్టారు. కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే.. సాక్షులని కవర్ చేసుకున్నారు. సాక్షుల్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే.. కోర్టు ముందే నీళ్లు నమలాల్సి వచ్చింది. సంస్థకు ఉద్యోగులే పెట్టుబడి.. వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు ఐటీ కంపెనీలు. ఇప్పుడు ఆ ఉద్యోగుల మీదే పోలీసులు… ఏ కారణం లేకుండా రాజకీయ అవసరాల కోసం.. ఇలా దాడులు చేసి హింసిస్తే.. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో పని చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా..?. ఇలా చేయడం.. హైదరాబాద్ పోలీసుల పై పడిన మచ్చ. ఇది చెరుపుకోవడం అంత తేలిక కాదు.
ప్రభుత్వం, పోలీసుల తీరుతో కంపెనీల్లో దడ పుట్టదా..?
ఐటీ గ్రిడ్ వ్యవహారం సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానుల్లో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. హార్డ్ డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లలో.. తాము సేవలు అందిస్తున్న కంపెనీలకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉంటుంది. సమాచారం మొత్తం సర్వర్లు, హార్డ్ డిస్కుల్లోనే ఉంటుంది. చెరిపేస్తే పోయేది కాదు అది. ఆ సర్వర్లు, హార్డ్ డిస్కుల్లో ఉండే సమాచారానికి ఎంత రక్షణ ఉంటుంది.. అనేదాన్నే… ప్రధానంగా.. ఐటీ కంపెనీలు.. చూసుకుంటూ ఉంటాయి. డేటా బ్రీచ్ జరిగితే.. అతి తమ కంపెనీ పునాదులు బలహీనం అయినట్లుగా భావిస్తూ ఉంటాయి. సాధారణంగా కంపెనీలకు… టెక్నాలజీ రూపంలోనే… డేటా భద్రతకు సవాళ్లు ఎదురువుతూ ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం… రాజకీయం కూడా…, దీనికి తోడయింది. హైదరాబాద్ లో రెండు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పోలీసులు వ్యవహరించిన తీరు ఐటీ కంపెనీల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీపై పోలీసులు వ్యవహరించిన తీరు.. తెలంగాణ ఐటీ వర్గాల్లో ఓ రకంగా అలజడి రేపింది. రాజకీయ అవసరాల కోసం.. ఓ కంపెనీ భవిష్యత్‌ను దెబ్బకొట్టడానికి పోలీసులు ఏ మాత్రం వెనుకాడకపోవడం… వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ సర్కార్కు్ మైనస్‌గా మారే ప్రమాదం కనిపిస్తోంది.
దీనికి తెలంగాణ సర్కారే బాధ్యత వహించాలా..?
ఐటీ కంపెనీల ఇమేజ్ చాలా సున్నితంగా ఉంటుంది. ఏ చిన్న అవకతవక జరిగినట్లు… ప్రచారం జరిగినా… వాటికి ఉన్న విలువ అమాంతం పడిపోతుంది. ఫేస్బుక్ లాంటి సంస్థకూ… ఇలాంటిది తప్పలేదు. ఇక చిన్న, మధ్యతరగతి కంపెనీల గురించి అయితే.. చెప్పాల్సిన పని లేదు. క్లయింట్లు ఏ మాత్రం… నమ్మకం కోల్పోయినా.. ఆ సంస్థ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు.. రాజకీయ పార్టీలకు సేవలు అందిస్తున్నాయి. కొన్ని రాజకీయ నేతల బంధువులకు సంబంధించినవి ఉన్నాయి. ఇలా ఒక సారి రాజకీయ కారణాలతో కంపెనీలను టార్గెట్ చేసుకోవడం ప్రారంభిస్తే.. మనుగడ సాగించడం కష్టమన్న ఆందోళన ఐటీ కంపెనీల ప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం వల్ల ఇప్పుడు సర్కార్‌కు చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడానికి తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి..!