తెలంగాణ ప్రభుత్వం విశ్వరూపం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు నీటి తిప్పలు ఎలా ఉంటాయో చూపించాలని డిసైడ్ అయింది. జూలైలోకి అడుగుపెట్టినప్పటికీ.. కృష్ణాకు రావాల్సినంత వరద రావడం లేదు. అతి స్వల్ప వరద మాత్రమే వస్తోంది. అయినప్పటికీ… కృష్ణా పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులపై విద్యుత్ ఉత్పత్తి జోరుగా చేస్తోంది. అటు శ్రీశైలం.. ఇటు నాగార్జున సాగర్.. చివరికి పులిచింతలలోనూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున నీరు ఉపయోగించినట్లుగా అవుతోంది. టీఎంసీల కొద్దీ నీరు తెలంగాణ ఉపయోగించుకుంటోంది. ఏ ప్రాజెక్టులోనూ విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణకు అవకాశం లేదు.
నిబంధలకు విరుద్ధంగానే ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి లేఖల రూపంలోనే ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. సాగర్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఏపీ అధికారులు .. తెలంగాణ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు … వారి వద్దకు వెళ్లాలనుకున్నారు. కానీ.. సాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ఏపీ అధికారుల్ని కూడా బ్యారెజ్ ఎక్కనీయలేదు. కనీసం వినతి పత్రం ఇవ్వాలన్నా కూడా అంగీకరించలేదు. ఫ్యాక్స్ చేసుకోవాలని సలహా ఇచ్చి వెనక్కి పంపేశారు. దాంతో ఆయా ప్రాజెక్టుల వద్ద ఏపీ అధికారులు షాక్ తినాల్సి వచ్చింది.
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం .. అధికారులు అలా నిస్సహాయంగా చూస్తుండిపోతున్నారు. మరో వైపు.. వర్షాలు పడటం కాస్త లేటయితే.. డెల్టా రైతాంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏపీ ప్రభుత్వం ఏమైనా అలజడి చేస్తుందన్న ఉద్దేశంతో.. పవర్ హౌస్‌ల వద్ద పెద్ద ఎత్తున తెలంగాణ పోలీసుల్ని మోహరించారు కానీ ఏపీ వైపు నుంచి ఎలాంటి హడావుడి లేదు. కేవలం.. వినతి పత్రాలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. కానీ వాటికి కూడా తెలంగాణ అనుమతి ఇవ్వడం లేదు.