తెలంగాణ ప్రభుత్వం డైవర్షన్ గేమ్ ఆడుతుందో .. సీరియస్ గానే చేస్తోందో కానీ అసలైన అంశాల కన్నా ఇతర విషయాలపై విపక్షాలు ఎక్కువగా ఫోకస్ చేసేలా చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం రాజకీయ పార్టీలు బీసీ కులగణనపైనే చర్చలు జరుపుతున్నాయి. తాము చేసిన కులగణనను అసెంబ్లీలో పెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం రెడీ అవుతూంటే బీసీ జనాభాను తక్కువ చూపించారని బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీల జనాభా ముస్లిం బీసీలు కాకుండా 46 శాతమే చూపించారని కానీ ఇంకా చాలా ఎక్కువ అంటున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్లలు చేసిన సకల జనులసర్వేలో బీసీల జనాభా చాలా ఎక్కువగా ఉందని తేలిందని ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారని కవిత సహా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం మాత్రం ఎవరూ బయట పెట్టడం లేదు. కేసీఆర్ చేసిన సర్వేను ఎప్పుడూ బయట పెట్టలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమాచారం కోసం వాడుకుందేమో తెలియదు కానీ.. ఆ వివరాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉన్నాయో లేదో చెప్పడం లేదు. అయితే అందులో ఏమున్నాయో బీఆర్ఎస్ నేతలు మాత్రం చెబుతున్నారు.
ప్రభుత్వం ఏం చేసినా విమర్శించేందుకే విపక్షాలు ఉంటాయి కాబట్టి కులగణలో తప్పుడు లెక్కలని విమర్శిస్తున్నారు. అయితే అసెంబ్లీకి వచ్చి అభ్యంతరాలు అన్నీ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నాలుగో తేదీన అంటే మంగళవారం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కులగణన రిపోర్టును ఆమోదించబోతున్నారు. ఈ క్రమంలో ఈ బీసీ కుల రాజకీయం మరింత జోరుగా సాగనుంది. ఎవరికి వారు తమ ప్రతిభ ప్రదర్శించేందుకు వెనుకాడటం లేదు.