2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం – బీజేపీ జతగా పోటీ చేశాయి. కొంత విరామం తర్వాత కలిసి చేశాయి. ఈ కాంబినేషన్‌కు మొదటి నుంచి కాస్త అనుకూలత ఏర్పడింది. అప్పట్లో మోడీ హవా ఉందనే ప్రచారం జరగడం… సెంటిమెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉండటంతో.. టీడీపీ – బీజేపీ కూటమి వర్కవుట్ అయింది. పోటీ చేసిన ఇరవై నాలుగు స్థానాల్లో పధ్నాలుగు సీట్లు గెలుచుకున్నారు. మిగతా పది సీట్లలో ఏడు ఎంఐఎంవి. అంటే.. ప్రత్యర్థులకు మూడు సీట్లు మాత్రమే.. వదిలి పెట్టారు. ఓ రకంగా ఇది స్వీప్ చేయడం లాంటిదే. కానీ నాలుగున్నరేళ్ల తర్వాత అంటే.. 2018 చివరిలో వచ్చిన ఎన్నికల్లో ఆ రెండు పార్టీల పరిస్థితి ఏమిటి..?
రెండు పార్టీలు సంయుక్తంగా గెలుచుకున్న స్థానాలకు ఏకంగా పదమూడు మైనస్ పడిపోయింది.అంటే.. రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి సాధించింది జీరో. గోషామహల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజాసింగ్ లోథ్ ఒక్కరే విజయం సాధించారు. నిజానికి ఈ రాజాసింగ్ కూడా సొంత ఇమేజ్‌తోనే గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ ముద్రతో గెలిచినా.. ఈ మధ్య కాలంలో ఆయన బీజేపీ అగ్రనాయకత్వంలో విబేధిస్తూనే వస్తున్నారు. పలుమార్లు పార్టీకి రాజీనామా చేసి.. తెలంగాణ శివసేన బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ.. అమిత్ షా సర్ది చెప్పడంతో పార్టీలోనే ఉండిపోయారు. ఆయన మజ్లిస్‌పై అత్యంత దూకుడుగా ఉండటంతో.. ఆ ఇమేజ్‌తోనే గెలిచారు కానీ.. బీజేపీ ముద్రతో కాదు. ఈ విధంగా చూస్తే.. బీజేపీ , టీడీపీ విడివిడిగా పోటీ చేసి.. జీరో స్థాయికి చేరినట్లే.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రాక ముందు నుంచీ… తెలంగాణ బీజేపీ నేతలు.. టీడీపీపై చెలరేగిపోయేవారు. ఒంటరి పోటీ అని హడావుడి చేసేవారు. చివరికి వారి కోరిక నేరవెరింది. దాంతో పాటు ఉన్న సీట్లూ ఊడిపోయాయి. దీన్ని బట్టి చూస్తే.. రాజకీయాల్లో ఎప్పుడూ… వన్ ప్లస్ వన్ … టూ అయ్యే చాన్స్ లేదు.. ఒక్కోసారి నాలుగు కావొచ్చు… ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తులా జీరో కూడా కావొచ్చు.