ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. 2009లో భారతీయ జనతా పార్టీ పరువు నిలిపిన అసెంబ్లీ నియోజకవర్గం అంబర్ పేట. ఆ ఒక్క స్థానం నుంచే కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా.. అందరి దృష్టి అదే నియోజకవర్గంపై ఉంది. గత ఎన్నికల్లోనే కిషన్ రెడ్డి.. అంబర్ పేట నుచి తప్పుకుని.. సికింద్రాబాద్ పార్లమెంట్ కు పోటీ చేయాలనుకున్నారు. కానీ దత్తాత్రేయకు హైకమాండ్ సీటు ఇచ్చింది. ఈ సారి కూడా.. జమిలీ ఎన్నికలు వస్తే.. అంబర్ పేటను భార్యకు ఇచ్చి.. తాను సికింద్రబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ముందస్తు రావడంతో బరిలోకి దిగక తప్పలేదు. గత రెండు ఎన్నికల్లో అంబర్ పేట నుంచి తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు ఆయన హిమాయత్ నగర్ నుంచి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి ఈ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. అందుబాటులో ఉంటారనే పేరు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కానీ ఇదేదీ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని కాపాడలేదు. అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ బలంతోనే ఈ సారి.. ప్రత్యేకమైన వ్యూహాన్ని టీఆర్ఎస్ అధినేత రెడీ చేశారు. మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ కాలేరు వెంకటేష్ ను కిషన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం కాలేరు వెంకటేష్ భార్య కార్పొరేటర్ గా ఉన్నారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డిపై సహజంగానే ఏర్పడే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లు కూడా తమకు కలిసివస్తుందని నమ్మకంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి బరిలో దిగగా 17 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తోంది.
కిషన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో.. నిర్లక్ష్యం చేసింది. టీజేఎస్ కు కేటాయింస్తారని ప్రచారం జరిగింది . అయినా చివరి నిమిషంలో తీవ్ర హైడ్రామా మధ్య కాంగ్రెస్ కూడా అంబర్ పేటలో పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ కానీ.. టీజేఎస్ అయినా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు . అంబర్ పేటలో పోటీ.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉండనుందని చెప్పుకోవచ్చు. కాలేరు వెంకటేష్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. జి.కిషన్‌రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలే షాక్ ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత గోల్నాక, అంబర్‌పేట, నల్లకుంట డివిజన్లకు చెందిన నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. అంబర్‌పేట డివిజన్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఆనంద్‌గౌడ్ పార్టీకి రాజీనామా చేసి కిషన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నల్లకుంట డివిజన్ రత్నానగర్‌కు చెందిన బీజేపీ సీనియర్‌నాయకుడు ప్రశాంత్ ముదిరాజ్, పార్టీకి రాజీనామా చేశారు. ఆనంద్‌గౌడ్ ను బుజ్జగించడానికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సైతం రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ అసంతృప్తులు, ఆయనపై వ్యతిరేకత .. పుట్టిముంచితే.. ఆశ్చర్యం లేదన్న అంశం.. అంబర్ పేటలో చక్కర్లు కొడుతోంది.