కాంగ్రెస్ లో సీట్ల కుమ్ములాట నెమ్మదిగా ఇప్పుడు గాంధీభవన్ కి చేరుకుంది. టిక్కెట్లు ప్రకటించక ముందే అసంతృప్తులు రాజుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి, ఢిల్లీలోని వార్ రూమ్ కి పిలిచి మరీ టిక్కెట్టు దక్కని నేతల్ని ముందస్తుగా బుజ్జగించినా… వారి అనుచరులు గాంధీభవన్ కు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. టిక్కెట్ తమ నాయకుడికే కావాలంటూ కొంతమంది.. పొత్తులో భాగంగా సీట్లను త్యాగం చేస్తున్న నియోజక వర్గాల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ మరికొందరు.. ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాదని, పారాచూట్ నేతలకు టిక్కెట్లు ఇస్తే ఎన్నికల్లో సహకరించేది లేదంటూ హెచ్చరించడానికి వచ్చిన ఇంకొందరు.. ఇలా గాంధీభవన్ ముందు వాతావరణం వేడెక్కింది.
ఉప్పల్ సీటు లక్ష్మారెడ్డికి ఇచ్చి తీరాలంటూ ఒక కార్యకర్త ఏకంగా పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సీటు పొత్తులో భాగంగా టీడీపీకి దక్కుతుందని ఇప్పటికే కొంత స్పష్టత వచ్చేసింది. ఖానాపూర్ సీటును రాథోడ్ రమేష్ కి ఇవ్వొద్దనీ, ఆయన తెరాస నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వలస నేత అంటూ కొందరు దీక్షలకు దిగారు. నకిరేకల్ సీటు నాకే ఇవ్వాలంటూ ప్రసన్నరాజు తన అనుచరులతో రెండ్రోజులుగా గాంధీభవన్ దగ్గరే దీక్ష చేస్తున్నారు. నాంపల్లి టిక్కెట్ మనోహర్ బాబుకి ఇవ్వాలంటూ వారి అనుచరగణమూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్ గిరి టిక్కెట్ టి.జె.ఎస్.కి వెళ్తుందనే ప్రచారం నేపథ్యంలో నాలుగేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకే సీటు ఇవ్వాలంటూ శ్రీధర్ డిమాండ్ చేస్తున్నారు. పారాచూట్ నేతలకు టిక్కెట్లు ఇవ్వొద్దని అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారనీ, కానీ వారికే ఇప్పుడు ప్రాధాన్యత లభిస్తోందనీ, మహా కూటమిలో భాగంగా పార్టీ కోసం ఎప్పట్నుంచో శ్రమిస్తున్న నేతల్ని పక్కనపెడుతున్నారనీ… ఇలాంటి డిమాండ్లన్నీ గాంధీభవన్ కి చేరాయి.
ఈ ఆందోళనలను సద్దుమణగాలంటే పార్టీ సీనియర్ నేతలు ఎవరైనా వీరికి స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేదా బుజ్జగించాలి. కానీ, ప్రముఖ నేతలు ప్రస్తుతం అందుబాటులో లేని పరిస్థితి. సీట్ల సర్దుబాట్లు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే… రాష్ట్ర నేతల్ని ఢిల్లీకి పిలిచి మరీ ముందస్తు బుజ్జగింపు చర్యలు ఎన్ని చేపట్టినా, క్షేత్రస్థాయిలో అవి పనిచేయడం లేదనే అభిప్రాయం కలుగుతోంది. సీట్ల ప్రకటన తరువాత కాంగ్రెస్ వర్గాల్లో లొల్లి తప్పదు అనే అభిప్రాయం ముందు నుంచే ఉంది. గాంధీభవన్ ముందు పరిస్థితి చూస్తుంటే… జాబితా వెలువడ్డ తరువాత ఉండబోయే పరిస్థితికి ఇదో ట్రైలర్ గా కనిపిస్తోంది. గడచిన రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను అదుపులోకి తెచ్చేందుకు పార్టీ నుంచి ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో వేచి చూడాలి.