” మోడీ గారి పాలనలో ఈవీఎంలకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయి. వాటిని కనిపెట్టుకుని ఉండండి” అని రాహుల్ గాంధీ తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన గంటల్లోనే చిత్ర విచిత్రమైన ఘటనలు బయట పడుతున్నాయి. రాజస్థాన్ లో.. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు కాకుండా బీజేపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్తున్నాయి. మరికొన్ని రోడ్ల పాలవుతున్నాయి. రాజస్థాన్లోని బారాన్ జిల్లా కిషన్గంజ్ అసెంబ్లీ నియోజక వర్గంలో శుక్రవారం రాత్రి ఈవీఎం రోడ్డుపై కొంత మందికి కనిపించిది. ఆ రోడ్డున పోయే వాళ్లు దాన్ని తీసుకుని పోలీసులకు అప్పగించారు. వాహనంలో తీసుకెళ్తూండగా జారిపడిపోయిందని సంబంధిత అధికారి కవర్ చేసుకున్నారు. అలాగే పాలి అనే నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఇంట్లో ఈవీఎం బయటపడింది.
నేరుగా స్ట్రాంగ్ రూంకు తీసుకెళ్లాల్సిన ఎన్నికల అధికారి.. ఈవీఎంను అభ్యర్థి ఇంటికి తీసుకెళ్లారు. అభ్యర్థి ఇంట్లో ఉన్న ఈవీఎంను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ రెండు చోట్ల రిటర్నింగ్ అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే… బయటపడ్డారు కాబట్టి.. చర్యలు తీసుకున్నారు. రహస్యంగా ఇంకెన్ని జరుగుతున్నాయోనన్న అనుమానం ప్రజల్లో ప్రారంభమయింది. రాజస్థాన్ కు కూడా శుక్రవారమే పోలింగ్ జరిగింది. అంతకు ముందు గత నెలలో జరిగిన మధ్యప్రదేశ్ పోలింగ్ తర్వాత కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. ఈవీఎంలను తీసుకుని కొంత మంది అధికారులు హోటళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
ఆ తర్వాత ఓ నిండా ఈవీఎంలతో ఓ లారీ దర్శనమిచ్చింది. అంతకు ముందు.. ఓ స్ట్రాంగ్ రూమ్ కి రోజంతా కరెంట్ లేదని.. సీసీ కెమెరాలు కూడా పని చేయలేదని తేలింది. ఈ వ్యవహారాలన్నీ వరుసగా బయటపడుతూండటంతో.. ఎన్నికలపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.ఈసీ అన్నీ బయటపడిన తర్వాత ఎన్ని చర్యలు తీసుకున్నా… ప్రయోజనం ఉండదు. ప్రజల్లో అనుమానాలు బలపడితే మొదటికే మోసం వస్తుంది. తెలంగాణలో ఇప్పటి వరకూ ఇలాంటివేమీ బయటపడలేదు. బయటపడితే రేగే రాజకీయ దుమారాన్ని ఆపడం కష్టం.