తెలంగాణ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ పెట్టినా, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా… తెలంగాణ ఎన్నికల గురించే. మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ఎలాగూ ముగుస్తుంది. అందుకే గంట గంటకూ… ఈ వేడి, ఆ టెన్షన్ పెరుగుతూ వస్తోంది. అయితే… తెలంగాణ ఎన్నికల విషయంలో చిత్రసీమ కాస్త అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. ఏ పార్టీకీ వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం లేదు. నిజానికి అలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే… నిన్నా మొన్నటి వరకూ అటు కేసీఆర్నీ, ఇటు కేటీఆర్‌ని తెగ పొగిడేసిన కథానాయకులు.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోవడం విడ్డూరంగా తోస్తోంది. రానా మొదలుకుని రామ్ చరణ్ వరకూ.. నాగ్ నుంచి విజయ్ దేవరకొండ వరకూ చాలామంది హీరోలు తమ ఆడియోలకు కేటీఆర్‌ని ఆహ్వానించి.. ప్రచారం చేసుకున్నవాళ్లే. సెల్ఫీలు దిగి.. ట్విట్టర్లలో పోస్ట్ చేసి – ప్రభుత్వ పనితీరు బాగుందని, కేటీఆర్ చాలా బాగా చేస్తున్నాడని కామెంట్లు దట్టించినవారే. చాలామంది హీరోలకు కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. సమంత, విజయ్ దేవరకొండలు… ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు. వీళ్లలో ఒక్కరు కూడా ఈ ఎన్నికల గురించి నోరు మెదపడం లేదు.
ఎన్నికలు అవ్వగానే మళ్లీ మామూలే. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మళ్లీ ఎప్పటిలా కేటీఆర్‌తోనూ, కేసీఆర్‌తోనూ స్నేహం మొదలైపోతుంది. ఒకవేళ పరిస్థితులు తారుమారు అయి.. మరో ప్రభుత్వం వస్తే – అప్పుడు ఈ సమీకరణాలన్నీ మారిపోతాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ఈ విషయం మన సినిమావాళ్లకు బాగా తెలుసు. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో కూడా గ్యారెంటీ లేదు. అందుకే బహిరంగంగా ఓ పార్టీకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడి, ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే తమ ఎదుగుదలకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే కీలమైన ఎన్నికల సమయంలో సైలెంట్ అయిపోయారు స్టార్లు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారానికి రమ్మని ఎవ్వరినీ ఆహ్వానించలేదు. కాకపోతే.. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తారేమో అని… కేటీఆర్ ఎదురుచూసినట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కానీ.. హీరోలంతా ఇప్పుడు టీఆర్ఎస్కి హ్యాండిచ్చేశారు. డిసెంబరు 11న రిజల్ట్ వచ్చాక… ఫలితాలు తేలిపోయాక… మళ్లీ ఈ హీరోలే బొకేలు పట్టుకుని క్యూలో నిలబడడం ఖాయం.