తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. స్లాట్ బుకింగ్‌కు సాఫ్ట్వేర్ సహకరించడం లేదు.చాంతాడంత నిబంధనలు… ట్యాక్స్ నెంబర్ల కారణంగా రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడం లేదు. ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టు స్టే విధించడంతో పాత విధానం అంటూనే కొత్త పద్దతిలో తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. కొత్త సాఫ్ట్వేర్ శాపంగా మారింది. ధరణి పేరుతోనే ఉన్న ఈ సాఫ్ట్వేర్… రిజిస్ర్టేషన్ల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చింది. స్లాట్ల బుకింగే పెద్ద సవాల్‌గా మారింది. మూడునెలల పాటు లావాదేవీలన్నీ నిలిచిపోవడంతో.. వారంతా ఇప్పుడు పని పూర్తి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో సహజంగా స్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉండి. కానీ రోజుకు పదుల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయలేకపోతున్నారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ర్టేషన్ల కోసం వచ్చిన వారంతా నిబంధనలను చూసి వద్దు బాబోయ్ అంటూ తిరుగు ప్రయాణం అవుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లకు కూడా అంతుబట్టకుండా ఉన్న సాఫ్ట్‌వేర్‌తో రిజిస్ట్రేషన్లు మందగించాయి. పాత విధానంలో రిజిస్ట్రేషన్ చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పలు చోట్ల.. ధర్నాలు కూడా చేస్తున్నారు. కొత్త విధానంలో రిజస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ లోనూ హద్దులు చూపకపోవడం, లింక్ డాక్యుమెంట్ లేకపోవడం వంటివి రిజిస్ట్రేషన్ చేసుకునే వారిని కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ విషయాల్లో తీవ్రంగా ప్రజా వ్యతిరేకత వస్తూండటంతో… సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు, బిల్డర్లు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను మంత్రులు సేకరించి పరిష్కార మార్గాలను కమిటీ సూచించాల్సి ఉంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతక మళ్లీ ప్రక్రియలో మార్పుచేర్పులు చేసే అవకాశం ఉంది. రెవిన్యూ సంస్కరణలు అని కేసీఆర్ ఆర్భాటంగా చేసిన మార్పులు ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవేం తిప్పలు అని ప్రజలు గొణుక్కోవడం తప్ప.. ఏమీ చేయలేకపోతున్నారు.