తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 30తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు కార్యకార్యక్రమం చేపట్టనుంది. మరో రెండున్నరేళ్ల పదవీకాలం ఉండగానే బండా ప్రకాశ్‌ను ఎమ్మెల్సీగా గులాబీనేత అవకాశం కల్పించారు. ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఆ కమ్యూనిటీ పార్టీకి దూరం కాకూడదని భావించి ప్రకాశ్‌ను ఎమ్మెల్సీగా చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
స్వల్పకాలం పదవి కావడంతో కేసీఆర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, ఇటీవల మళ్లీ దగ్గరైన సీఎల్ రాజం, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వంటి వారి పేర్లు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. ఇప్పటికి ఒక్క స్థానానికే నోటిఫికేషన్ వచ్చినా మరో నెలలో మరో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. సిట్టింగ్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ. శ్రీనివాస్ పదవి కాలం ముగియనుంది. ఒకరికి వయసు సహకరించడం లేదు.. మరొకరు టీఆర్ఎస్లో లేరు . దీంతో కొత్త వారికి చాన్స్ ఖాయంగా కనిపిస్తోంది.
దేశ రాజకీయాలపై, ఫోకస్ పోట్టిన గులాబీ అధినేత కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేసేవారు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా, అండగా నిలిచేలా ఉన్న నేతలు, రాజకీయాలపై పట్టుండి, మాట్లాడేవారిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దళితబంధును ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తుండటంతో ఆ విషయాన్ని దేశమంతా ప్రచారం చేసేందుకు ప్రధాన ఆస్త్రంగా ఉపయోగపడేలా దళితులకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారని చెబుతున్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఒకే సారి ప్రకటించే అవకాశం ఉంది.