తెలంగాణలో ఉగాది రోజు నుంచి ప్రభుత్వం పేదల కడుపు నింపే చల్లని పథకాన్ని అమలు చేస్తోంది. ఇక నుంచి రేషన్ బియ్యంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉగాది రోజు నుంచే ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో సన్న బియ్యమే ఎక్కువగా పండిస్తున్నారు . సన్నబియ్యం సమృద్దిగా అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు రేషన్ బియ్యం చాలా మందికి ఆధారం. ఇప్పుడు అత్యంత నిరుపేదలు కూడా రేషన్ లో పంపిణీ చేస్తున్న బియ్యాన్ని తినడం లేదు. ఎందుకంటే అవి దొడ్డు బియ్యం. ప్రభుత్వం రేషన్ దుకాణాల నుంచి లబ్దిదారులు ఠంచనుగా బియ్యం తీసుకుంటారు. వాటిని కేజీ పది రూపాయల చొప్పున బియ్యం వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో కేజీకి రూ.30కిపైగా ఖర్చు పెడుతోంది. లబ్దిదారులు పది రూపాయలకు అమ్మేస్తున్నారు. అదంతా ఆఫ్రికా దేశాలకు స్మగ్లింగ్ అయిపోతోంది.
అదే పేదలకు రేషన్ బియ్యంలో తినలేని బియ్యానికి బదులు సన్న బియ్యం ఇస్తే వాటిని అమ్ముకునే ప్రయత్నం అసలు చేయరు. వారు బయట కేజీకి రూ. 40 పెట్టి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తినగలిగే సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల ఆ ఖర్చు అంతా పేదలకు మిగిలిపోతుంది. ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు చేస్తున్న ఓ ఖర్చుకు సార్థకత వస్తుంది.
గతంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. గోతాలను కూడా ముద్రించింది. కానీ సన్నబియ్యం ఇవ్వలేక చేతులెత్తేసింది. దానికి నాణ్యమైన బియ్యం అని పేరు మార్చింది. బియ్యం మాఫియా కోసమే ఇలా చేశారని సన్నబియ్యం ఇస్తే ఎవరూ అమ్ముకోరని అప్పుడు స్మగ్లర్లకు బియ్యం సమస్య ఏర్పడుతుందన్న ఉద్దేశంతో అదే బియ్యాన్ని పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి క్షుద్ర రాజకీయ ఆటలను పేదలతో ఆడకుండా నిరంతరం .. సన్నబియ్యం పంపిణీ చేస్తే తెలంగాణ ప్రభుత్వం పేదలకు .. ఎవరూ చేయనంత మేలు చేసినట్లే.