తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతున్న రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓపక్క ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఉభయ సభల్లో నిరసన గళం పెంచితే, మరోపక్క తెరాస ఎంపీలు రిజర్వేషన్ల అంశమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, కాపు రిజర్వేషన్ల అంశమై కేంద్రం ఎలా స్పందించిందో, ఇప్పుడు తెలంగాణ పంపిన ముస్లింల రిజర్వేషన్ల ప్రతిపాదనపై కూడా అదే తరహాలో కేంద్రం స్పందించింది. అయితే, రాజ్యాంగం ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని ధర్మాసనం ఇంతకుముందే చెప్పింది. కానీ, అసాధారణ పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ కొంత మినహాయింపు ఇవ్వొచ్చని కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఆలోచన ఏంటంటే.. తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉన్న ఆ అసాధారణ పరిస్థితులేంటో కేంద్రానికి వివరించడం.
ఇదే అంశమై ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో కేసీఆర్ భేటీ అయ్యారు. కేంద్రానికి పంపించాల్సిన నివేదికపై చర్చలు జరిపారు. ముస్లింల రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపుదామనీ, ఆ తరువాత కేంద్రం స్పందన చూద్దామని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అప్పటికీ సానుకూలంగా ప్రకటనలు లేకపోతే… తదుపరి కార్యాచరణ ఆ తరువాతే ఆలోచిద్దాం అని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతానికి కేంద్రం కోరిన వివరణపై సరైన నివేదిక తయారు చేసి ఇవ్వడమే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. కారణం ఏంటంటే, కేసీఆర్ థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు ప్రయత్నాలే. ఆయన జాతీయ రాజకీయాలవైపు వస్తున్నానని ప్రకటించాక… తెరాస ప్రతిపాదించిన ఈ ముస్లింల రిజర్వేషన్లు కుదరవంటూ కేంద్రం అభ్యంతరాలు పెడుతోందన్న కోణంలో కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి ఈ అంశాన్ని ఆ కోణంలో కేసీఆర్ ఇంకా డీల్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. కేంద్రం వివరణ కోరింది, మరింత సమాచారం ఇవ్వాలంది. కాబట్టి, అది ఇచ్చాక కూడా భాజపా సర్కారు నుంచి స్పందన వేరేగా ఉంటే.. అప్పుడు కార్యాచరణ ఉంటుందని సంకేతాలు మాత్రమే ఇస్తున్నారు. థర్డ్ ఫ్రెంట్ అని కేసీఆర్ అన్నారు కాబట్టే, కేంద్రం కేసీఆర్ కు మోకాలడ్డటం మొదలుపెట్టిందనే ఒక ప్రచారమైతే తెరాస శ్రేణుల్లో అప్పుడే మొదలైపోయింది. మోడీ, అమిత్ షా ద్వయం గమనిస్తోందో లేదోగానీ… రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజపా వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివరణలూ నివేదికల స్థాయిలో ఉన్న ఈ రిజర్వేషన్ల అంశాన్ని, మున్ముందు ఓ రాజకీయ అస్త్రంగా కేసీఆర్ మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..!