తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు పక్కన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం 2019 తర్వాత ఊహించనంత వేగంగా పెరిగింది. దానికి ఔటర్ అవతల 20 కిలోమీటర్ల వరకూ ఏర్పడిన వెంచర్లు మాత్రమే సాక్ష్యం కాదు.. . ప్రభుత్వానికి చేరుతున్న రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా. 2018-19లో తెలంగాణ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.6,612 కోట్లు. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెలన్నర రోజుల వరకూ వచ్చింది రూ.12,624 కోట్లు. ఎలా లేదన్న మార్చి ముగిసే సరికి పదిహేను వేల కోట్లకు చేరుతుంది.
అంతే కాదు.. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అంటే అటూ ఇటూగా ఇరవై వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుంది. ఏపీలో ప్రభుత్వం మారక ముందు .. మారిన తర్వాత నాలుగేళ్లలో తెలంగాణ రియల్ ఎస్టేట్ జాతకం అలా మారిపోయిందన్నమాట. ఈ ఏడాది వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రూపంలో 17.16లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ధరణి పోర్టల్‌కు 10.54 కోట్ల హిట్లతో ఇప్పటివరకు 30కోట్ల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2014-15లో భూ లావాదేవీలు 8.26లక్షల డాక్యుమెంట్లు మాత్రమే. అత్యధికంగా హైదరాబాద్ చుట్టే రియల్ వ్యాపారం జోరందుకుంటోంది.
ఎక్కువ క్రయవిక్రయాల జాబితాలో మొదటి స్థానంలో రంగారెడ్డి, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరీ, హైదరాబాద్ ఉన్నాయి. ఓ వైపు పొరుగున ఉన్న ఏపీలో ఆస్తుల విలువ ఏ మాత్రం పెరగకపోగా పడిపోతోంది. మరో వైపు తెలంగాణలో ఇబ్బడిమబ్బడిగా పెరుగుతోంది. లక్షల కోట్లలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఓ వైపు రిజిస్ట్రేషన్ల ఆదాయం మాత్రమే కాదు…. ప్రభుత్వ భూముల విలువ పెరగడంతో పెద్ద ఎత్తున వాటిని అమ్మి ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. ఆర్థిక సమస్యలు తీర్చుకుంటోంది.