తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని తరచూ ప్రకటించే కేసీఆర్ మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితినే గుర్తించిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఐరాసకు చెందిన అంతర్జాతీయ ఆహార సంస్థ ఎఫ్.ఎ.వో నుంచి ఈ మేరకు సమాచారం వచ్చిందని మీడియాకు ప్రెస్ నోట్ పంపింది తెలంగాణ ప్రభుత్వం. వరల్డ్ సీడ్ బౌల్‌గా తెలంగాణను గుర్తించడమే కాదు.. ఆ సక్సెస్ స్టోరీని షేర్ చేసుకోవాలని ఆహ్వానించింది కూడా. రోమ్‌లో నిర్వహించనున్న ఈ సదస్సుకు తెలంగాణ ప్రభుత్వం తరపున విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కేశవులను పంపుతున్నారు.
నాలుగు, ఐదు తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది. ” ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా.. తెలంగాణ స్టేట్ యాస్ ఏ గ్లోబల్ సీడ్ హబ్ ” అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఇది అంతర్జాతీయంగా తెలంగాణకు దక్కిన గుర్తింపు అని ప్రభుత్వం సంతోషపడుతోంది. 195 ప్రపంచ దేశాలకు చెందిన మంత్రులు, ప్రతినిధులు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని.. తెలంగాణ గురించి అన్ని ప్రముఖ భాషల్లో డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారని ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించడానికి ఈ గుర్తింపు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంత గొప్ప ఘనత సాధించినా తెలంగాణ తరపున మంత్రులెవరూ వెళ్లకుండా అధికారిని మాత్రమే పంపుతున్నారు.