తెలంగాణ యువతకు ఇది సర్కారీ ఉద్యోగ నామ సంవత్సరం అంటే అతిశయోక్తి కాదేమో. ఏడాది పొడుగునా వరసగా ఉద్యోగ నియామకాలకు పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. మొట్టమొదట గురుకులాల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియ మొదలవుతుంది. దాదాపు 5 వేల పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలుకానుంది. ఈనెలలోనే ఇందుకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
వైద్య, ఆరోగ్య శాఖలో దాదాపు 1500 ఖాళీలను భర్తీ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది. అలాగే పశు సంవర్ధక శాఖలో సుమారు 450 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి లేదామార్చిలో ప్రకటన రావచ్చని సమాచారం.
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల భర్తీ వీలైనంత త్వరగా జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఖాళీ పోస్టుల లెక్కలు ఇంకా తేలలేదని సమాచారం. వీలైనంత త్వరగా ఈ లెక్కలను తేల్చి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే త్వరలోనే వేలాది టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికోసం యువత ఆత్రుతగా ఎదురుచూస్తోంది..
ఇటీవలే తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది, తాత్కాలికంగా ఉద్యోగుల సర్దుబాటు జరిగింది. ఇక పక్కాగా జిల్లాల వారీగా అవసరమైనంత మంది ఉద్యోగుల నియామకాలు జరగాల్సి ఉంది. వివిధ శాఖల్లో ఎన్ని పోస్టులు అవసరం అనే లెక్కలు తయారవుతున్నాయి. ఇవి పబ్లిక్ సర్విస్ కమిషన్ కు అందగానే నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. నిజానికి గురుకులాల్లో 8 నుంచి 10 వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది అయితే మొదటి విడతలో 5 వేల పోస్టు భర్తీకి కసరత్తు జరుగుతోంది. మిగతా పోస్టులను ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది గానీ భర్తీ చేస్తారని సమాచారం. మొత్తం మీద తెలంగాణలో ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు త్వరలోనే మొదలు కాబోతున్నాయి.