తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ల కిందట… టీఆర్ఎస్కు దగ్గరవుతున్న సూచనలు కనిపించాయి. ఆ కారణంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ సమయంలోనే.. “వెల్కం” పేరుతో..తెలంగాణలో పట్టు సాధించాలని.. కొంత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెల్కం.. అంటే.. వెలమ ప్లస్ కమ్మ. కానీ తర్వతా పరిస్థితులు మారిపోయాయి. రేవంత్ కోరుకున్నట్లు.. టీడీపీ.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు రేవంత్ చెప్పిన ఈక్వేషన్ కు భిన్నమైన సోషల్ ఇంజినీరింగ్ కనిపిస్తోంది. తెలంగాణ జనాభాలో పన్నెండు శాతం ఉన్న రెడ్డి సామాజికవర్గానికి దాదాపుగా ముఫ్పై శాతానికిపైగా సీట్లను కాంగ్రెస్ కేటాయిస్తోంది. రాష్ట్ర విభజనతో.. రెండు రాష్ట్రాల్లోనూ… అధికారం కోల్పోయామన్న భావనలో ఉన్న.. రెడ్డి సామాజికవర్గం.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవి తమ సామాజికవర్గ నేతకే వస్తుందన్న ధీమాతో… ఈ సారి కాంగ్రెస్ వైపు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ – టీడీపీ పొత్తు… తెలంగాణ రాజకీయాల సీన్ ను పూర్తిగా మార్చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో.. అధికారం మార్చి మార్చి పంచుకున్న రెండు సామాజికవర్గాల మధ్య.. సఖ్యత తెలంగాణలో సాధ్యపడింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంపై ఆశ పెట్టుకోలేదు. గత ఎన్నికల తర్వాత.. టీఆర్ఎస్ అధినేత చేసిన ఆపరేషన్ ఆకర్ష్ తో… కకావికలమై.. ఉనికి నిలబెట్టుకునేందుకు తాపత్రయ పడాల్సి వస్తోంది. అందుకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఈ పరిణామం… గ్రేటర్ తో పాటు.. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి చోట్ల.. విభిన్నమైన ఈక్వేషన్స్ కు తెర తీసింది. తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే సామాజికవర్గం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నిజానికి దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల మధ్య పొత్తులంటే.. ఆయా పార్టీలకు అండగా ఉన్న సామాజికవర్గాల నుంచి అనుకూలత రాదు.
కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీలో.. కాంగ్రెస్ తో పొత్తుపై.. ఎలాంటి.. అలజడి లేదు. ఏపీలో కొంత మంది నేతలు వ్యతిరేక మాటలు మాట్లాడినా… తెలంగాణలో మాత్రం నూటికి నూరు శాతం.. సానుకూలత వచ్చింది. దీంతో ఇప్పుడు… సోషల్ ఇంజినీరింగ్ లెక్కలు చూస్తే.. మహాకూటమి.. దుర్బేధ్యంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.