తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏపీలో విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది. అందులో సందేహమే ఉండదు. ఇప్పటికే పార్టీకి ఇంచార్జ్ ను నియమించారు. కానీ ఏపీలో హడావుడి చేస్తే తెలంగాణలో మైనస్ అవుతుందన్న ఉద్దేశంతో కేసీఆర్ హడావుడి తగ్గించారు. కానీ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ఆయన తగ్గే అవకాశం ఉండదు.
ఏపీ అధికార పార్టీతో కేసీఆర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక వేళ జగన్ రెడ్డికి ఇబ్బంది అవుతుదంనుకుంటే కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉండదు. గతంలోలా జగన్ రెడ్డి పార్టీకి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసే అవకాశం ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోతే మాత్రం.. ఏపీలో జగన్ రెడ్డి సర్కార్ కూ గడ్డు పరిస్థితి వస్తుంది. అంతో ఇంతో అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయారు.. మొత్తం దుంప నాశనం చేసిన జగన్ రెడ్డి తుడిచి పెట్టుకుపోతారని జనం చెప్పుకోవడం ప్రారంభిస్తారు.
గతంలో హైదరాబాద్ నుంచి అందిన సహకారం బీఆర్ఎస్ కు అందదు. ఆ ప్లస్ పాయింట్ టీడీపీకి లభించే అవకాశం ఉంది. ఒకవేళ లభించకపోయినా టీడీపీకి నష్టమేం లేదు కానీ.. వైసీపీ మాత్రం నష్టపోతుంది. అందుకే.. తెలంగాణ ఎన్నికలపై ఏపీలోనూ ఎక్కువ ఆసక్తి ఉంది. పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహించారు.