తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నేటి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను చూస్తే… ఇంతకీ తెలంగాణలో ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేకపోయారా అన్నట్టుగా ఉన్నాయి! ఎడిటోరియల్ మొదలుకొని చాలా కథనాల్లో అదే కనిపిస్తుంది. తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఆంధ్రాలో రాబోతున్నాయంటూ జోస్యం చెప్పారు. తెలంగాణలో విధ్వేషాలు రగిలించే ప్రయత్నాలు చంద్రబాబు చేశారనీ, ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ ఓ కథనంలో రాశారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు అపవిత్రమని రుజువైపోయిందనీ, ఆంధ్రాలో కూడా టీడీపీ ఓటమి తప్పదంటూ మరికొన్ని విశ్లేషణలు చేశారు. ఆంధ్రాకి వచ్చి రాజకీయాల్లో చేతులు పెడతా అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బాగానే ప్రాధాన్యత కల్పించారు. జాతీయ మీడియా అంతా టీడీపీ ఓటమినే చర్చించుకుందీ అంటూ మరో కథనం రాశారు. తెలంగాణలో ఉండే సెటిలర్లు టీడీపీని తిరస్కరించారనీ, దీన్ని మినీ ఆంధ్రా తీర్పుగా చూడాలంటూ విశ్లేషించారు. ఇక, ఎడిటోరియల్ లో అయితే కాంగ్రెస్ పార్టీకి చీవాట్లు పెట్టారు! వందేళ్ల అనుభవం ఉన్న ఆ పార్టీకి టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అగత్యం ఏమొచ్చిందంటూ అభిప్రాయపడ్డారు.
కొమ్ముల తిరిగిన మీడియా సంస్థల మద్దతులో చంద్రబాబు ఊదరగొట్టించినా, పెద్ద ఎత్తున సొమ్ము వెదచల్లినా ఫలితం లేకపోయిందనీ… ఇలా నేటి సాక్షి పత్రికలో పుంఖానుపుంఖాలుగా అభిప్రాయాలూ, వ్యాసాలూ, కథనాలు వేశారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోందంటే… తెలంగాణలో సీఎం పదవి కోసం చంద్రబాబు పోటీ పడి ఓడిపోయారా అనిపిస్తుంది. పొత్తులో భాగంగా కేవలం 13 సీట్లకు మాత్రమే టీడీపీ పోటీ చేసింది. ఒకవేళ అవన్నీ గెలుచుకున్నా కూడా తెలంగాణలో టీడీపీ తిప్పగలిగే చక్రం అంటూ ఏదీ ఉండదు. ఆ సీట్ల కోసం ఏకంగా వందల కోట్లు ఖర్చు పెట్టేంత ప్రయత్నం చంద్రబాబు చేస్తారా అనే అంశాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా చాలా రాసేశారు.
ఇంకోటి… తెలంగాణలో విధ్వేషాలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారంటూ రాసేయడం మరీ ఆశ్చర్యం! మొత్తంగా, ఎన్నికల ప్రచార సభల్ని తీసుకుంటే… చంద్రబాబుని తీవ్రంగా విమర్శించింది ఎవరు..? మళ్లీ ఆంధ్రోళ్ల ఆధిపత్యం కిందకి రాష్ట్రం వెళ్లనిద్దామా అంటూ పిలుపునిచ్చిందెవరు..? తెలంగాణకు చంద్రబాబు అవసరమా అంటూ ప్రాంతీయ సరిహద్దులను గుర్తు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసిందెవరు..? ఇవేవీ సాక్షి కథనాల్లోగానీ, విశ్లేషణల్లోగానీ ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణలో టీడీపీ ఓడిపోయింది… ఆంధ్రాలో ఓడిపోతుంది… ఇదే బేస్ లైన్ గా పెట్టుకుని, వాస్తవాలను పక్కనపడేసి పేజీలను నింపుకొచ్చారు. అన్నిటికీ మించి… తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రా రాజకీయాలు వేరు అనే విభజన లేకుండా… అక్కడ టీడీపీకి వచ్చిన ఫలితాలే ఇక్కడొచ్చేస్తాయనే ఆశాభావమే ఎక్కువగా కనిపించింది. తెలంగాణను ఒక యూనిట్ గా తీసుకుని.. అక్కడి పరిస్థితుల మధ్య వచ్చిన ఫలితాలుగా సాక్షి వీటిని చూడలేకపోయింది. పైగా, అదే ఆంధ్రాలో రిఫ్లక్ట్ అవుతుందని తీర్మానించేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే… తెలంగాణలో కూటమి ఓటమిని, ఆంధ్రాలో తమ గెలుపునకు పడ్డ పునాదులుగా సంబరపడుతున్న పరిస్థితి వారిలో కనిపిస్తోంది.