అప్పులు పెరిగాయి.. ఆదాయం తగ్గిందని ఇలాంటి పరిస్థితిని ప్రజలకు వివరించి ఒక్కో పథకం అమలు చేసుకుంటూ వెళ్తున్నామని.. ఎక్కడా దాచుకోవడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అప్పుల విషయంలో ఆయన పూర్తిగా మాజీ సీఎం కేసీఆర్ ను నిందిస్తున్నారు. కేసీఆర్ తప్పులు చేశారని వాదిస్తున్నారు. ఇలా చెప్పడానికి రేవంత్ కు హక్కు ఉంది. కానీ ఆదాయం పడిపోయిందని అంటే మాత్రం కేసీఆర్ ను కారణంగా చూపించలేరు.
ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తుంది – ఎలా వాడారన్నదే ముఖ్యం !
గత ప్రభుత్వంలో దండిగా అప్పులు చేశారు. ఆ అప్పుల్ని సంపద సృష్టికే వాడామని వారు చెబుతారు. గుదిబండగా మారాయని రేవంత్ అంటారు. ఈ విషయం పక్కన పెడితే ఏ ప్రభుత్వమైనా దొరికినంత అప్పులు చేస్తుంది. ఆదాయం పెంచుకుని వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే చేయాల్సి ఉంది. కానీ ఆదాయం పడిపోవడం రేవంత్ కు సమస్యగా మారింది. ఆదాయం తగ్గిపోవడం..గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలు చెల్లించాల్సిన సమయం రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆదాయం ఎందుకు తగ్గిందో విశ్లేషించుకున్నారా ?
తెలంగాణకు హైదరాబాద్ వంటి మెట్రో సిటీ ఉంది. ఆదాయం ఇబ్బడిమబ్బడిగా పెంచుకునే వనరులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ ను బేస్ చేసుకుని … తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయం తగ్గిపోయిందన్న మాట ప్రభుత్వం వైపు నుంచి వస్తోంది. ఇదేమి చిన్న విషయం కాదు. అసలు ఆదాయం పెరగకపోవడమే తగ్గిపోవడం. ఇప్పుడు పెరగకపోగా తగ్గిపోయిందంటే.. లోపం ఎక్కడుందో అందరూ సులువుగా గుర్తిస్తారు.
వెంటనే పాలసీలు మార్చుకోవాల్సిన అవసరం !
70వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని రేవంత్ ఓ సందర్భంలో చెప్పారు. ఇదేమీ చిన్న విషయం కాదు. అందుకే వెంటనే పాలసీలు రివ్యూ చేసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ ప్రభావాల కారణంగా ఆదాయంపై ఎఫెక్ట్ పడితే దానికి సీఎం ఏమీ చేయలేరు కానీ..రాష్ట్ర పాలసీల కారణంగా ఆదాయం తగ్గితే మాత్రం ఖచ్చితంగా మార్పు చేసుకోవాల్సిందే. లేకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ దిశగా సీఎం రేవంత్ దృష్టి పెట్టాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.