రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది అధికార పార్టీ తెరాస. మొదట్నుంచీ వినిపిస్తున్నట్టుగానే కే కేశవరావుకు మరోసారి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనతోపాటు మాజీ స్పీకర్, సురేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు సీఎం. నిజానికి, సురేష్ రెడ్డి పేరు కూడా మొదట్లో వినిపించింది. ఎందుకంటే, ఎన్నికల ముందే ఆయన తెరాసలో చేరారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా టిక్కెట్ ఆశించినా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇవ్వలేకపోయారు. అదే సమయంలో… పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామనీ, మంచి పదవి ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని కథనాలు వచ్చాయి. అదే అంశాన్ని కొన్ని సందర్భాల్లో సురేష్ రెడ్డి కూడా ప్రస్థావించారు. ఇప్పుడా మాట నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. కేశవరావు, సురేష్ రెడ్డి… ఈ ఇద్దరూ రేపు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల అనంతరం, సురేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా మండలికి పంపిస్తారనే చర్చ జరిగింది. అయితే, ఆయనకి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, రాజ్యసభకి వెళ్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన కూడా ముఖ్యమంత్రికి వినిపించారు. అయితే, రాజ్యసభకు నోటిఫికేషన్ వచ్చాక… ఇతర ఆశావహులు నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారుగానీ, సురేష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించలేదు.
కేశవరావు కొనసాగింపుపై రకరకాల అభిప్రాయాలు వినిపించినా, ఆయనకి మరో ఛాన్స్ ఇస్తున్నారని రెండ్రోజుల కిందటే దాదాపు స్పష్టమైపోయింది. కేకే స్థానంలో కవితను పంపిస్తారని కొన్నాళ్లు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, రెండో సీటు ఎవరికి వస్తుందా అనే ఉత్కంఠే చివరి నిమిషం దాకా కొనసాగింది. మొదట్నుంచీ రాజ్యసభ సీటు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. చివరి క్షణం వరకూ ఆయన గట్టి ప్రయత్నమే చేశారు. తనకు మద్దతుగా ఎమ్మెల్యేలను కూడా కూడగట్టి మంత్రి కేటీఆర్ ని కలిశారు, గడచిన కొద్దిరోజులుగా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉంటూ వచ్చారు. సామాజిక వర్గాల వారీగా చాలామంది నేతలు ఈ సీటు కోసం పోటీ పడ్డారు. సీతారామ్ నాయక్, హెటిరో కంపెనీ అధినేత పార్థసారధి రెడ్డి… ఇలా చాలామంది ప్రయత్నించినా, అంతిమంగా ఈ ఇద్దరి పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారు.