ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం… అసలు సమస్యంతా దీని చుట్టూనే తిరుగుతున్నట్టుగా ఉంది! కార్మికులతో చర్చకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. దాని కోసం ఒక కమిటీని కూడా వేసింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ని కార్మికులు కూడా వదులుకున్నట్టుగా ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కోర్టులో కార్మికుల తరఫున లాయరు కూడా ఇదే మాట అన్నారని చెప్పారు. కాబట్టి, విలీనం మినహా ఇతర డిమాండ్లపై కమిటీ చర్చించి, సీఎంకి నివేదిక ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. ఆ తరువాత చర్చలు కార్మికులతో చర్చలు అంశం నిర్ణయం ఉంటుంది.
విలీనంపై ప్రభుత్వం కావాలనే తప్పుతోవ పట్టించేలా మాట్లాడుతోందని కార్మిక సంఘాలు అంటున్నాయి. విలీనం మీద తాము ఎక్కడా తగ్గామని ఎప్పుడూ చెప్పలేదన్నారు అశ్వత్థామరెడ్డి. కోర్టులో తమ తరఫు న్యాయవాది కూడా విలీనం అంశం అప్రాధాన్యం అన్నట్టుగా మాట్లాడలేదనీ, అలా వ్యాఖ్యానించినట్టు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేస్తున్నారు. విలీన అంశం ప్రధానంగానే చర్చలకు ప్రభుత్వ ఆహ్వానిస్తే వెళ్తామనీ, లేకపోతే ప్రభుత్వం రమ్మన్నా వెళ్లే ప్రసక్తే ఉండనీ, సమ్మె ఉద్ధృతి తగ్గదని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వంలో విలీనం చేసేస్తే మిగతా డిమాండ్లు కూడా వాటంతట అవే నెరవేరుతాయని చెబుతున్నారు.
బస్ భవన్ లో ఈడీల సమావేశం జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన 26 డిమాండ్లలో విలీనం మినహా… ఇప్పకిప్పుడు నెరవేర్చాల్సినవి ఏమున్నాయి, వీటిని పరిష్కరించే క్రమంలో కార్పొరేషన్ మీద పడబోయే భారం పరిస్థితి ఏంటనేది చర్చించారు. మరో రెండ్రోజుల్లో ఈ కమిటీ చర్చల సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇస్తుంది. అయితే, విలీనం డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై చర్చలకు పిలిచే కసరత్తే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. కానీ, ఆ డిమాండ్ లేకపోతే చర్చలకు కార్మికులు రారు. అంటే… తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నాం, సమ్మెను వెంటనే ఆపాలన్నదే తమ ప్రయత్నం, కానీ ఈ కార్మికులే చర్చలకు రావడం లేదు అనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. ఏదేమైనా… ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఫుల్ స్టాప్ పాయింట్ ఇంకా ఎక్కడో అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నం కూడా కంటితుడుపు చర్యగానే కనిపిస్తోంది. విలీనమే ప్రధానమని కార్మికులు అంటుంటే… అది మినహా అని ప్రభుత్వం కమిటీలు పెట్టి చర్చించడం నిరుపయోగం. విలీన డిమాండ్ కు ప్రత్యామ్నాయం ఏంటో దానిపై కసరత్తు జరగాలి కదా!