తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు… ఓ నిరుపద కుటుంబాన్ని ఇక్కట్లలో పడేశాయి. అయిన వాళ్లందరూ ఆ కుటుంబాన్ని… ముఖ్యంగా ఆ కుటుంబంలోని మహిళను అనుమానంగా చూడటం ప్రారంభించారు. మాట్లాడటం మానేశారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని.. .కుటుంబ సభ్యులూ ఒత్తిడి తెస్తున్నారట. ఇంతకూ ఈ మహిళ ఎవరంటే… ప్రభుత్వ ప్రకటనల్లో భర్తను మార్చేసి… భార్యను మాత్రమే ఉంటి ఫోటో షాప్ చేసిన ప్రకటనల్లో కనిపించిన మహిళ. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మ పథకాలు రైతు బంధు, కంటి వెలుగు పథకాల ప్రచారానికి .. ఓ కుటుంబం ఫోటోల్లో భర్తలను మార్చేయడం కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలోని మహిళ పరిస్థితి దుర్భరంగా మారింది.
నల్లగొండ జిల్లాకు చెందిన పద్మ, నాగరాజు అనే దంపతులు.. ప్రభుత్వ ప్రకటనల్లో కనిపిస్తున్నారు. వారేమీ మోడల్స్ కాదు. నిరుపేదలు. మూడేళ్ల కిందట… రుణాలు ఇస్తామంటూ కొంత మంది అధికారులు వీరి ఫోటోలను తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్లు రుణాల సంగతి మర్చిపోయారు. వీరు ఫోటోల సంగతి కూడా మర్చిపోయారు. కానీ మధ్యలో ఓ సారి.. మీ ఫోటో పేపర్లో వచ్చిందని ఎవరో చెబితే… వీళ్లు లైట్ తీసుకున్నారు. కానీ నిజంగానే అప్పట్లో మరో యాడ్లోనూ ఈ కుటుంబాన్ని వాడుకున్నారు. తాము నాటు సారా కాస్తామని… తాగుతామని … కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చొరవతో… కాపుసారా కాయడం లేదని.. తాగడం లేదని వీరు చెబుతున్నట్లుగా ఆ ప్రకటన ఉంది.
ఆ తర్వాత వీరిని కంటి వెలుగు, రైతు బంధు పథకాల ప్రచారానికీ వాడుకున్నారు. అయితే కంటివెలుగు ప్రచారానికి భర్తను మార్చేయడం వీరిని ఇబ్బందికి గురి చేసింది. గ్రామస్తులంతా సూటిపోటి మాటలు అనడం, అత్తామామలు అనుమానిస్తూడటంతో వారు… కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్కకు మొరపెట్టుకున్నారు. తమకు సెంట్ భూమి లేదని… అయినా రైతుబంధు చెక్కులు అందుకున్నట్లు చూపించారని… తాము ఎప్పుడూ కాపు సారా కాయలేదని..తాగలేదని.. అయినా అలాగే చూపించారని… ఆవేదన చెందుతున్నారు. గొప్పగా ప్రచారంతో… ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకుంది ప్రభుత్వం. అందు కోసం పద్మ,నాగరాజు కుటుంబాన్ని బ్రాండ్ అంంబాసిడర్లుగా వాడేసుకుంది. ఇప్పుడు ఈ కుటుంబ గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం మళ్లీ ఎలా తెచ్చి పెడుతుందో చూడాలి..!