ఆర్టీసీ జేయేసీ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించేసింది! సమ్మె యథాతథంగా కొనసాగుతుందనీ, ఎలాంటి మార్పు లేదనీ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నట్టు అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఉద్యమకారులను పోలీసులతో అణచివేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తే, నిరసనలు మరింత తీవ్రతరం అవుతాయన్నారు. ఆర్టీసీ సమ్మె తదుపరి కార్యాచరణపై హైదరాబాద్ లో జరిగిన చర్చలకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో పాటు సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా నేతలు హాజరయ్యారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకూ చేపట్టబోయే కార్యక్రమాలు జాబితా విడుదల చేశారు. సోమవారం నాడు అన్ని డిపోల దగ్గరా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు నిరహార దీక్షలతో మొదలుపెట్టి, ఈ నెలాఖరున ఐదు లక్షల మందితో సకల జనుల సమరభేరిని నిర్వహిస్తామని ప్రకటించారు.
ఓపక్క ఆర్టీసీ జేయేసీ నిరసన కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించిన రోజునే… హైకోర్టు ఆదేశాల కాపీతో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకి వెళ్లారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ. ప్రగతి భవన్ లో సమ్మె అంశమై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కార్మికులతో చర్చల అంశమై ఎలా ముందుకు వెళ్లాలనే అంశమ్మీద చాలాసేపు మాట్లాడినట్టు సమాచారం. నిజానికి, శుక్రవారం సాయంత్రమే ఈ సమీక్షను ముఖ్యమంత్రి నిర్వహించాల్సి ఉంది. అయితే, కోర్టు ఆదేశాల కాపీ తమకు అందలేదన్న కారణంతో సమీక్ష రద్దు చేసుకున్నారు. ఆదివారం నాడు కాపీ అందడంతో సీఎం స్పందించారు. శనివారంతో విద్యాసంస్థల సెలవులు కూడా పూర్తయ్యాయి. ఇంకోపక్క ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందిని కూడా సమ్మెకు మద్దతు ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు కోరారు. దీంతో, సోమవారం నుంచి పరిస్థితి ఎలా మారుతుందనేది చూడాలి.
ఆర్టీసీ జేయేసీ సమ్మె షెడ్యూల్ కొనసాగింపును ప్రకటించేసినా… చర్చలకు ప్రభుత్వం సిద్ధపడితే ముందుకొచ్చేందుకు సానుకూలంగానే ఉన్నారు కార్మికులు. ఒకవేళ ప్రభుత్వం చొరవ చూపకపోతే, మరో పదిరోజులు సమ్మె తప్పదనే సంకేతాలు ఇవ్వనే ఇచ్చేశారు. ఓరకంగా బాల్ ని ముఖ్యమంత్రి కోర్టులోకి నెట్టేశారు. ఆర్టీసీ ఉద్యోగుల తీరు వల్లనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ దసరా పండుగ ముందురోజున ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు! దీపావళి పండుగ దగ్గరకి వచ్చేసరికి… ముఖ్యమంత్రి తీరు వల్లనే ఆర్టీసీ సమ్మె ఒక కొలీక్కి రావడం లేదనీ, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వైఖరిలో మార్పు ఉంటుందా లేదా అనేది చూడాలి.