శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీ సర్కార్.. కేఆర్ఎంబీకి లేఖ రాసింది. కానీ ఇక్కడ తెలంగాణ సర్కార్ తిరకాసు పెట్టింది. శ్రీశైలంలో ఏపీకి కుడిగట్టు కింద విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ… పోతిరెడ్డి పాడు నుంచి మాత్రం నీళ్లు విడుదల చేయవద్దని లేఖ రాసింది. ఏపీ వాటా కింద విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. ఆ నీరు దిగువకు వెళ్తుంది.
అంటే నాగార్జున సాగర్ కు వెళ్తుంది. కానీ రాయలసీమకు వెళ్లదు. రాయలసీమకు వెళ్లాలంటే.. పోతిరెడ్డి పాడు ద్వారా రిలీజ్ చేయాలి. ఇప్పుడు.. శ్రీశైలం నిండింది. గేట్లు ఎత్తారు. కానీ రాయలసీమకు మాత్రం నీళ్లు పంపలేకపోతున్నారు. గేట్లు ఎత్తినా దిగువకు.. అంటే సాగర్‌కే నీరు చేరుకుంది. ఇక్కడే ఏపీ సర్కార్‌కు చిక్కులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా తమకు పోతిరెడ్డి పాడు నుంచి నీరు విడుదలను పెంచాల్సి ఉంది. కానీ తెలంగాణ అభ్యంతర పెట్టింది. కృష్ణాబేసిన అవసరాలకే అనుమతి ఇవ్వాలని కోరుతోంది.
దీనిపై.. కృష్ణాబోర్డు.. కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల.. నెల రోజుల పాటు చేస్తే కానీ.. పూర్తి స్థాయిలో సీమలో అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. అనుమతి లేని కారణంగా.. తెలంగాణ అభ్యంతర పెట్టిందన్న కారణంగా … పోతిరెడ్డి పాడు నుంచి నీటి విడుదల ఆపాలని … కేఆర్ఎంబీ ఆదేశిస్తే మాత్రం. ఇబ్బందికర పరిస్థితులు.. సీమ ప్రజలకు ఎదురవుతాయి.