తెలంగాణలో నిర్మించిన కొత్త సచివాలయానికి ముహుర్తాన్ని మొదట సంక్రాంతిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పనులు పెండింగ్‌లో ఉండటంతో ఫిబ్రవరికి మార్చారు. కేసీఆర్ పుట్టిన రోజుకు మించిన ముహుర్తం ఏముంటుందని ఆ తేదీనే ఖరారు చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభం కానుంది. కొత్త సచివాలయం ప్రారంభానికి పలుమార్లు ముహుర్తం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఆరేడు నెలల్లో పూర్తి చేయాలనుకున్నారు. ఇది మూడేళ్లు దాటిపోయింది. మధ్యలో కరోనా కారణంగా మరికొంత ఆలస్యం అయింది. గత దసరాకే ప్రారంభిస్తారని అనుకున్నా.. తర్వాత సంక్రాంతి అన్నారు. ఇప్పుడు కేసీఆర్ పుట్టిన రోజుకు మరింది.
20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్ ఉంటుంది.
తెలంగాణ ఏర్పాటయ్యాక.. ఉమ్మడి రాష్ట్ర పాలనా అవశేషాలు ఉండకూడదని ప్రత్యేకమైన తెలంగాణ పాలనా అస్థిత్వం ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కు ప్లాన్ చేశారు. ముందుగా ఇతర చోట్ల ఏర్పాటు చేయాలనుకున్నారు. సాధ్యం కాలేదు. ఏపీలో సర్కార్ మారడంతో.. కొత్తగా వచ్చిన జగన్ సర్కార్.. భవనాలు మొత్తం కేసీఆర్ సర్కార్ కు అప్పగించడంతో వాటిని కూలగొట్టి .. కొత్త సెక్రటేరియట్ నిర్మించారు.