తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లక్కీ నెంబర్ ఆరు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన ఏం చేసినా ఆరుతో కలిసి వచ్చేలా చేసుకుంటారు. ఇప్పుడు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం విషయంలోనూ ఆయన ఆరునే నమ్ముకున్నారు. ఆరు నిమిషాల్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 1.58 నుంచి ప్రారంభించి 2.04 నిమిషాల్లో పూర్తి చేయాలని అధికారికంగా ఆదేశించారు. ఈ ఆరు నిమిషాల్లో తమకు కేటాయించిన కార్యాలయాల్లో అధికారులు ఆసీనులై ఒక్క ఫైల్‌పై సంతకం పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే బీఆర్ఎస్ కే భవన్ సహా ఇతర చోట్ల ఉన్న కార్యాలయాల్లో ఫైల్స్ ను కొత్త సచివాలయంలోకి తరలింపును ప్రారంభించారు. మూడురోజుల్లో మొత్తం పూర్తయిపోతుంది. వచ్చే సోమవారం నుంచి ఇక పాలన మొత్తం కేరాఫ్ కొత్త సచివాలయమే. ఒక్కో ఫ్లోర్ కు మూడు శాఖల చొప్పున కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ ఉండబోతున్నాయి. మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ & ఎస్సీ డెవలప్మెంట్ శాఖలకు కేటాయించారు. నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్ లో సీఎం, సీఎస్ లకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు శాఖల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించి, అదేరోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయనున్నట్టు సమాచారం. దీనికిగాను అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారమే నిర్వహించనున్నారు.