దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు రోజుల్లో ప్రక్రియ పూర్తయిపోయింది. ఇప్పుడు.. శిధిలాల తొలగింపును మరో ఇరవై రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున వాహనాలతో శిధిలాలలను తొలగిస్తున్నారు. తరవాత కొత్త భవనం నిర్మాణం ప్రారంభిస్తారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని కేసీఆర్ గతంలోనే పూర్తి చేశారు.
న్యాయవివాదాలు పరిష్కారం కావడంతో ఇప్పటికి కూల్చివేతలు పూర్తి చేశారు. 11 భవనాలతో పాటు ఆలయం, మసీదు, బ్యాంకులను కూల్చివేశారు. రెండు బ్లాక్లు ఏడు అంతస్తులు ఉన్నాయి. వందలాది కూలీలు, ఆధునిక యంత్రాలతో ప్రక్రియ పూర్తిచేశారు. ఈ నెలాఖరుకి శిధిలాలను మొత్తం తొలగిస్తారు. చదును చేస్తారు. ఒకప్పుడు భవనాలతో ఎప్పుడూ రద్దీగా ఆ ప్రాంతం ఇక విశాల మైదానంగా కనిపిస్తుంది. వ్యర్థాలన్నింటినీ.. రీ సైకిల్ చేసే పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఎక్కడా బయటపడేయకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అక్టోబరు నుంచి నిర్మాణ పనులు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్లాన్ను మంత్రివర్గం ఆమోదించింది. నిర్మాణ పనుల కోసం రూ. నాలుగువందల కోట్లు కేటాయించారు. టెండర్లను త్వరలోనే ఖరారు చేయనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం కనబడేలా.. డిజైన్ ను కేసీఆర్ ఖరారు చేశారు. నిర్మాణం ప్రారంభించిన ఆరు నెలల్లోపే… కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.