తెలంగాణ కాంగ్రెస్ లో తాము సీనియర్లం.. తాము టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఏమిటి అన్న “హై”లో ఉన్న నేతల మెడలను రేవంత్ రెడ్డి వంచేశారు. టిక్కెట్ కావాలనుకున్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. చివరికి కోమటిరెడ్డి కూడా తనకు నల్లగొండ స్థానం కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకోకపోతే ఆ పేరు చెప్పి టిక్కెట్ నిరాకరిస్తారేమోనని చాలా మంది కంగారు పడి.. చివరి రోజు హడావుడిగా పీఏలతో దరఖాస్తులు పంపించారు.
తాము సీనియర్లమని.. తమకు పిలిచి టిక్కెట్ ఇస్తారన్న అభిప్రాయం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోక తప్పలేదు. రూ. 50వేలు ఫీజు కట్టి మరీ తమకు కావాల్సిన చోట దరఖాస్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, సీనియర్ నేత జానారెడ్డి కుమారులు, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు అందరూ అప్లికేషన్లు ఇచ్చారు. ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి తరపున ఆయన అనుచరులు కొడంగల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. ఖచ్చితంగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లనే పరిశీలిస్తామని హైకమాండ్ చెప్పడంతో.. సీనియర్లు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అనూహ్యంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయింది. మధుయాష్కీకి.. ఎల్బీనగర్ కు సంబంధమే లేదని.. నిజామాబాద్లో గెలుపు కష్టమని భావించి గ్రేటర్ పరిధిలోప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 119 స్థానాల కోసం దాదాపుగా వెయ్యి దరఖాస్తులు వచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను వడబోసి.. షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుంది.