బీజేపీలో నెంబర్ త్రీగా ఉన్న బీఎల్ సంతోష్‌ను తమ ఎదుట హాజరయ్యేలా చూసుకునేందుకు తెలంగాణ సిట్ చేసిన ప్రయత్నాలు చివరికి బెడిసికొట్టాయి. ఆయనకు సిట్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఇంతకు ముందు బీజేపీ తరపున ఆయనకు నోటీసులు జారీ చేయడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన హైకోర్టు.. ఆయన విచారణకు హాజరైతే ఇబ్బందేమిటని ప్రశ్నించింది. హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఈ సారి బీఎల్ సంతోష్ స్వయంగా పిటిషన్ వేశారు. రిలీఫ్ తెచ్చుకున్నారు.
అసలు ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని.. అలాంటప్పుడు ఆయన పేరును నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని బీఎల్ సంతోష్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్ పాత్రపై పూర్తి స్థాయి ఆధారాలున్నాయని సిట్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నోటీసులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను డిసెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.
గురువారమే రెండోసారి సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి 41 ఏ సీఆర్సీపీ కింద నోటీసులు జారీ చేశారు. 28వ తేదీన కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ సారి హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామన్న సంకేతాలు పపారు. బీఎల్ సంతోష్‌తో పాటు తుషార్, జగ్గూ స్వామి వంటి వారికి నోటీసులు ఇచ్చినా వారూ హాజరు కావడం లేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.