వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే.. తుషార్‌తో పాటు రామచంద్రభారతితో ఆయన ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను చూపి.. వారితో ఉన్న సంబంధాలేమిటో చెప్పాలని సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు ఢిల్లీలో కానీ.. హైదరాబాద్ ఇంటికి కానీ ఎలాంటి నోటీసులు రాలేదని రఘురామ చెబుతున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం రఘురామకు నోటీసులిచ్చామని మీడియాకు అంతర్గతంగా సమాచారం ఇస్తున్నారు. నిందితులతో ఆయన దిగిన ఫోటోలను లీక్ చేశారు. 29వ తేదీన హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అయితే రామచంద్ర భారతి, తుషార్ తమ జీవితంలో ఎంత మందిని కలిస్తే.. అంత మందికి నోటీసులు ఇస్తారా అన్న విమర్శలు కూడా సిట్ మీద వస్తున్నాయి. వారు చేసిన నేరానికి వారిని కలిసిన వారందరూ ఎలా బాధ్యులవుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలా.. ఫోటోలను చూసి నోటీసులు జారీ చేస్తూ పోతే కేసులో సీరియస్ నెస్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. నోటీసులు వస్తే తనకు ఎలా స్పందించాలో తెలుసని.. రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. అయితే ఫోటోలు దిగినంతనే నోటీసులు ఇవ్వరని..ఇంకేదో ఉందని ఆ డీల్స్‌లో ఆయన కూడా భాగమయ్యారన్న అనుమానాన్ని మరికొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు పోలీసులు ఏసీబీ కోర్టులో.. ఇప్పటి వరకూ ఉన్న నిందితులకు తోడుగా మరో ముగ్గర్ని చేర్చారు. ఏ 4 నిందితుడిగా బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్నుచేర్చారు. తర్వాత తుషార్ చెల్లపల్లి, జగ్గూ స్వామి, లాయర్ శ్రీనివాస్‌ను కూడా చేర్చారు. మొత్తంగా ఈ కేసులో ఏడుగురు నిందితులు ఉన్నట్లయింది. అయితే బయట రాష్ట్రాల్లో ఉంటున్న వారు.. తెలంగాణ సిట్ నోటీసులకు స్పందించడం కష్టంగా మారింది. ఇక్కడ నమోదవుతున్న కేసులనూ వారు పట్ిటంచుకోవడం లేదు.