తెలంగాణ అసెంబ్లీలో ఎట్టకేలకు కాస్త కదలిక వచ్చింది. తెలుగుదేశం నుంచి తెరాసలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకరు మధుసూదనాచారి గురువారం నాడు నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించినట్లుగా వస్తున్న ఆరోపణలకు సంబంధించి వారు వివరణ ఇవ్వాల్సిందిగా మొత్తం పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలకు స్పీకరు కార్యాలయం నోటీసులు పంపింది. ఎమ్మెల్యేలు పార్టీ మారి ఫిరాయించిన తర్వాత.. వారి సొంత పార్టీలు వారి మీద ఫిర్యాదు అంటూ ఇచ్చిన తర్వాత.. వారికి ఏదో ఒక సందర్భంలో నోటీసు ఇవ్వడం అనేది చాలా మామూలు సంగతి. కాకపోతే ఇప్పుడు స్పీకరు తెరాసలో చేరిన తెదేపా ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులు సీరియస్‌గా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఇచ్చినవేనా? లేదా, కామెడీగా తాము తలచినట్లుంగా తంతు ముగించడానికి ఇచ్చినవేనా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.
తెదేపా నుంచి గతంలో 5 గురు ఎమ్మెల్యేలు ఫిరాయించారు. తలసాని శ్రీనివాసయాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావు వారిలో ఉన్నారు. అదే మాదిరిగా ఇటీవలి పరిణామాల్లో మరో 5గురు ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, వివేక్‌గౌడ్, ప్రకాశ్‌గౌడ్, సాయన్న, రాజేందర్‌రెడ్డి ఉన్నారు. గతంలో అయిదుగురికి నోటీసులు ఇచ్చిన స్పీకరు, మిగిలిన అయిదుగురికి కూడా ఇప్పుడునోటీసులు ఇచ్చారు.
ఇటీవలే.. చేరికలు మొత్తం 10కి చేరిన తర్వాత.. తమను తెలుగుదేశంలో విలీనం అయినట్లుగా గుర్తించాలంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకరుకు లేఖ ఇచ్చిన తర్వాత, అదే సమయంలో తెదేపా కొత్త ఫ్లోర్‌లీడర్ హోదాలో ఈ పదిమంది మీద అనర్హత వేటు వేయాల్సిందే అంటూ రేవంత్‌రెడ్డి స్పీకరుకు ఫిర్యాదుచేసిన నేపథ్యంలో ఈ నోటీసులు అనేవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ ఇద్దరు నేతలు లేఖలు ఇచ్చిన నాటినుంచి.. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. రాజ్యాంగ ఉల్లంఘన లేకుండా.. ఎలాంటి నియమాలను పాటించాలో.. అనే విషయంలో స్పీకరు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లకు ఈ పదిమందికి నోటీసులు అందడం పూర్తయింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
అయితే సీరియస్ గా ఈ నోటీసులు ఇచ్చారా? లేదా, ‘మమ’ అనిపించడానికి నోటీసులు ఇచ్చి తంతు పూర్తిచేసేయడానికి తుది అంకానికి చేరుతున్నారా? అనేది స్పీకరు నిర్ణయాన్ని బట్టి తెలుస్తుంది.