హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా వ్యవహారంపై తెలుగుదేశం తీసుకొచ్చిన ఒత్తిడి ఎట్టకేలకు ఫలించింది. స్పీకర్ మధుసూదనాచారి చివరికి స్పందించారు. రాజీనామా లేఖ తనదగ్గరే ఉందని, ఒకటి, రెండు రోజులలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తమకు హామీ ఇచ్చినట్లు టీడీపీ నేతలు ఇవాళ తెలిపారు.
తలసాని వ్యవహారంపై తెలంగాణ తెలుగుదేశం నేతలు ఇటీవల ఒత్తిడిని బాగా పెంచిన సంగతి తెలిసిందే. రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డివంటి తెలుగుదేశం నేతలు నిన్న గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్ళి తలసానిని బర్తరఫ్ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అయితే విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ చేయలేనని గవర్నర్ బదులివ్వటంతో వారు రాజ్భవన్ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ వారు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి నివాసాన్ని ముట్టడించారు. మధుసూదనాచారి ముఖ్యనేతలను ఇంట్లోకి పిలిపించుకుని వారితో మాట్లాడారు. బయటకొచ్చిన తర్వాత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ, సనత్నగర్లో తలసాని గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. టీఆర్ఎస్లో చేరిన ఇతర టీడీపీ ఎమ్మెల్యేలుకూడా రాజీనామా చేయాలని డిమాండ్ చెేశారు.