తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు టెన్షన్ తీరిపోయింది. పరీక్షలు జరుగుతాయా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. జరగవని ప్రభుత్వం ప్రకటించేసింది. అంత కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అందర్నీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేసి.. పైతరగతులకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 5,34,903 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షల బాధ లేకుండా… ఇంటర్మీడియట్ కోర్సుల్లో జాయిన్ కానున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కొన్ని పరీక్షలు జరిగిన తర్వాత.. హైకోర్టు నిలిపివేసిది. ఆ తర్వాత లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. రెండున్నర నెలలు గడిచిన తర్వాత .. లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు కానీ.. కరోనా కేసులు తగ్గడం లేదు. దీంతో.. హైకోర్టు..గ్రేటర్ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. కానీ ఇలా ఒక చోట కాదని..మరో చోట నిర్వహిస్తే.. సాంకేతిక సమస్యలు వస్తాయని భావించిన ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ప్రభుత్వం ఇలా.. పబ్లిక్ పరీక్షలను రద్దు చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా.. విద్యార్థులను పై తరగతులకు పంపింది.
ఈ విధానాన్ని అధ్యయనం చేసిన తెలంగాణ అధికారులు..చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో టెన్త్ విద్యార్థుల పాస్ శాతం.. 90 శాతం వరకూ ఉంటోంది. ఫెయిలయ్యేవారు పరిమితంగానే. అయితే గ్రేడ్లు, మార్కులు మాత్రమే..అందరికీ ప్రాధాన్యతాంశంగా మారింది. ఇప్పుడు ఇంటర్నల్ మార్కుల ద్వారానే గ్రేడ్లు ఇవ్వబోతున్నారు. దీని వల్ల బాగా చదివే వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితే ఏర్పడవచ్చంటున్నారు.