కొత్త ఏడాదిలో వస్త్రాలపై జీఎస్టీని ఐదు నుంచి పన్నెండు శాతానికి కేంద్రం పెంచింది. ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వరుసగా రెండు, మూడు రోజులుగా కేంద్రం నిర్ణయం పై విరుచుకుపడుతున్నారు. బీజేపీ నేతలే ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారని .. ఇలా అయితే చేనేతలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. జీఎస్టీని పెంచాలా.. తగ్గించాలా అన్నది జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయిస్తారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి కూడా సభ్యునిగా ఉంటారు.
మరి జీఎస్టీ కౌన్సిల్లో దుస్తులపై పన్ను పెంచాలని నిర్ణయించినప్పుడు తెలంగాణ తరపున హాజరైన ఆర్థిక మంత్రి సైలెంట్‌గా ఉన్నారా..? సమర్థించారా ? వ్యతిరేకించారా ?. నిజానికి మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆ నిర్ణయం అమలు చేసే అవకాశం ఉండదు. కానీ జీఎస్టీ అనేది కేంద్రం పన్ను అని జనం భావన కాబట్టి ప్రజలు అలానే అనుకుంటారని…తమపై వ్యతిరేకత రాదన్న కారణంగా ఎక్కువ ప్రభుత్వాలు సైలెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు అమల్లోకి తీసుకు వచ్చే వారం రోజుల ముందుగా రాజకీయం ప్రారంభించారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదు లక్షలు దాటిన వారిపై ఆదాయం పన్ను బాదుతున్నారు.
ఇక తక్కువగా ఆదాయం ఉన్న వారి నుంచి జీఎస్టీలు.. పెట్రోల్, డీజిల్ పేరుతో ఆదాయంలో సగం లాగేసుకుంటున్నారు. ఇప్పుడు దుస్తుల మీద కూడా పన్నులేస్తున్నారు. ఇంత దారుణమైన పన్నుల వ్యవస్థ ఏ దేశంలో అయినా ఉంటుందో లేదో కానీ… ఓ వస్తువుకు ప్రతి దశలో పన్ను చెల్లించాల్సిన రావాల్సిన పరిస్థితి ఇండియాలోనే ఉంది. అలాగే ఆ పన్నులకు తోడు ఆదాయపు పన్ను కూడా కట్టించుకుని డబుల్ పన్నులు వసూల్ చేస్తున్నారు. కానీ తప్పు మాది కాదంటే మాది కాదని రాజకీయ పార్టీలు మాత్రం డ్రామాలాడుతూ ఉంటాయి. ఓటర్లను పిచ్చి వాళ్లను చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.