తెలంగాణ రాష్ట్రంలో ఒకదాని తర్వాత మరొకటి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. మునిసిపాలిటీల వరకు ఎన్నికలు పూర్తయ్యాయి కదా అనుకుంటే.. రాజ్యసభ ఎంపీ పదవులకు ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 21వ తేదీ నాటితో తెలంగాణ నుంచి ఎన్నికైన ఇద్దరు సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. దానికంటె సుమారు రెండు వారాల ముందే కొత్త సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని పూర్తిచేయాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఈ రెండు ఎంపీ ఖాళీలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి.. రెండు స్థానాలు కూడా అధికార తెరాస పార్టీకి మాత్రమే దక్కే అవకాశం ఉన్నది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం పదవులు ఖాళీ చేస్తున్న సిటింగులు ఇద్దరికీ మళ్లీ అవకాశం దక్కేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున వీ హనుమంతరావు, తెదేపా తరఫున గెలిచి ప్రస్తుతం తెరాసలో ఉన్న గుండు సుధారాణి ఎంపీ పదవులు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు గనుక.. వీహెచ్‌కు రిక్తహస్తమే. గుండు సుధారాణికి కూడా కేసీఆర్ రెండో అవకాశం ఇవ్వకపోవచ్చు. పార్టీలో పోటీ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం.
తెరాసలో ఎంపీ పదవులకోసం తొలినుంచి నిరీక్షిస్తున్న పెద్దలు చాలా మందే ఉన్నారు. ప్రధానంగా తనకు చాలా సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని కేసీఆర్ స్వయంగా ఆబ్లిగేషన్ కింద భావిస్తున్నారనేది పార్టీ వర్గాల సమాచారం. కాబట్టి ఆయనకు తప్పకుండా ఛాన్స్ దక్కవచ్చు. ఇకపోతే ఉన్న ఒక్కసీటుకోసమే ఎంతమంది అయినా తమ ప్రయత్నాలు సాగించుకోవాలి. కేసీఆర్‌కు సన్నిహితుల జాబితాలోనే పత్రికాధిపతి సీఎల్ రాజం, పార్టీ కోశాధికారి దివకొండ దామోదర్ రావు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మైనారిటీ మరియు కులాల కాంబినేషన్లను కూడా పరిగణనలోకి తీసుకునేట్లయితే మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ప్రస్తుత హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి ల పేర్లను కూడా కేసీఆర్ పరిశీలించవచ్చునని అంటున్నారు. మొత్తానికి తెరాస వారికి మాత్రమే రెండు సీట్లూ దక్కే అవకాశం ఉండడంతో అక్కడ బీభత్సంగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.