కాపీలు కొట్టే చాన్స్ ఇస్తే.. మాల్ ప్రాక్టీస్ చేయించుకోనిస్తే.. ఫలితాలు ఎక్కువే వస్తాయని విద్యాశాఖమాత్యుల వారు తన తెలివితేటల్ని పలుమార్లు ప్రదర్శించారు. ఫలితాలు ఎందుకు తక్కువ వస్తున్నాయి..గతంలో ఎందుకు వచ్చాయంటే వారు చెప్పిన కారణం ఇది. ఇది సజ్జల ఐడియానే . స్వయంగా ఆయన ప్రెస్మీట్లో అదే చెప్పారు. అ తర్వాత బొత్స అందుకున్నారు. ఇప్పుడు తెలంగాణ టెన్త్ ఫలితాలు 90శాతానికిపైగా వచ్చాయి. ఇంటర్ ఫలితాలు కూడా ఏపీ కంటే ఎక్కువే.
పదో తరగతి పరీక్షా ఫలితాలు ఏపీలో అసాధారణంగా వచ్చాయి. ఆ విషయం తెలంగాణ ఫలితాలతో తేలిపోయింది. తెలంగాణలో 90 శాతం మంది పాసయితే.. ఏపీలో ఇరవై మూడు శాతం తక్కువ. ప్రభుత్వం కోవిడ్ అని.. మరొకటని కారణం చెప్పింది. పిల్లల జీవితాలను నాశనం చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే వారిపైనా విరుచుకుపడ్డారు. తిట్ల దండకం వినిపించారు. ఇప్పుడు తెలంగాణ టెన్త్ ఫలితాలు చూసిన తర్వాత చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు రగిలిపోతున్నారు. ప్రభుత్వం అంతా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని.. నిందలు తమపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అనుకుంటున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు పెట్టి నేరుగా పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. నేరుగా పాసవలేని వారు సప్లిమెంటరీలో అసాధారణంగా పాసవుతారా ?. సప్లిమెంటరీలో పాస్ పర్సంటేజీ ఇరవై, ముఫ్పై శాతం కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు దాదాపుగా అందర్నీ పాస్ చేసి.. సర్టిఫికెట్లు ఇస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నాడు – నేడు అంటూ స్కూళ్లలో బెంచీలు, రంగులు వేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ టీచర్లను నియమించలేదు. పనుల మీద దృష్టి పెట్టి అసలు చదువుకు అవసరమైన మౌలిక వసతి అయిన టీచర్లను రిక్రూట్ చేయకపోవడం వల్ల సమస్య వచ్చినట్లుగా అందరూ ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో 90 శాతం ఫలితాలు కూడా తక్కువే. గతంలో అంత కంటే ఎక్కువే వచ్చేవి. కరోనా కారణంగా కొంత తగ్గాయి. నిజానికి గత ఏడాది క్లాసులు బాగానే జరిగాయి. అంతకు ముందు కరోనా సమయంలో ప్రభుత్వం వివిధ రకాలుగా విద్యార్థులకు చదువు చెప్పింది. ఆన్‌లైన్‌తో పాటు టీవీల ద్వారా పాఠాలు చెప్పింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రచారానికే పరిమితమయింది. అది చేశాం.. ఇది చేశాం అని చెప్పుకోవడం తప్ప.. చేసిందేమీ లేకుండా పోయింది. ఈ కారణంగా భావి పౌరుల భవిష్యత్ లక్షల్లో అంధకారంగా మారింది.
ఎక్కడో గుజరాత్లో ఫలితాలు ఏపీ కన్నా తక్కువ వచ్చాయని పోల్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో వచ్చిన ఫలితాలపై స్పందించాల్సి ఉంది. తెలంగాణ విద్యార్థులు కాపీ కొట్టి..మాల్ ప్రాక్టీస్ చేసి పాసయ్యారని ఒక్క ముక్కలో తేల్చేస్తారేమో చూడాలి !