తెలంగాణలో టిడిపి పరిస్థితి అయోమయంగా వుంది. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు , అన్నిచోట్లా భవనాలు యంత్రాంగం వున్నాయి. కాని విధానమే లేదు. అధినేతకు ఆసక్తి లేదు. మూడో పెద్ద పార్టీగా వచ్చిన టిడిపిని ఫిరాయింపులు ఒకవైపు ఓటుకు నోటుతో పోటు మరో వైపు కుదిపేశాయి. ఇది చాలక బిజెపి నాయకత్వం కూడా తెలంగాణలో వారితో పొత్తు వుండదని కుండబద్దలు కొట్టి చెప్పేసింది. రేవంత్ రెడ్డి వంటివారు స్వంతంగానూ పార్టీ పరంగానూ కూడా కాంగ్రెస్తో సహా ఐక్యత అన్నప్పటికీ ఎపిలో దేశంలో కూడా కుదిరేపని కాదని అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో చెప్పండంటూ అమరావతిలో చంద్రబాబు నాయుడుతో సమావేశమై వచ్చారు. ముందస్తుకు సన్నద్ధం కావాలని చెప్పిన ఆయన బిజెపితో సంబంధాల విషయం చెప్పలేకపోయారు. వారు స్వంతంగా పెరగాలనుకోవడం తప్పు కాదు అని ఆమోదముద్ర వేశారు. అయితే మాకు ఎన్డిఎ పేరిట, బిజెపి గుర్తుపై పోటీ చేసేందుకు అవకాశం ఇమ్మని టిటిడిపి నాయకులు అడిగారట. నేను వారి జాతీయ నాయకులతో మాట్లాడతానంటూ చంద్రబాబు సరిపెట్టేశారు. ఈ విషయమై బిజెపిలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. వారు వచ్చి చేరితే వేరే విషయం గాని మనుగడ కాపాడుకుంటూ మన గుర్తుపై పోటీ ఏమిటని రాష్ట్ర నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే జాతీయ అవసరాలు దృష్టిలో పెట్టుకుని మరోసారి చర్చిస్తామని రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ చెబుతున్నారు. స్వతహాగా వెంకయ్య నాయుడుకు దగ్గరగా వుండే లక్ష్మణ్ ఎపి విషయంలోనూ తమ అవసరాలను బట్టి కొంత సర్దుబాటు పాట పాడుతున్నారు. పొత్తు ప్రసక్తేలేదని గతంలో కొందరు నాయకులు చెప్పిన దానికి ఇది కొంత భిన్నం. టిఆర్ఎస్ మనతో మంచిగా వుంటే టిడిపి ఎందుకుని మరికొందరి వాదన.