తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత పార్టీ నుంచి మరో్ నేత జంప్‌కి సిద్ధంగా ఉన్నారా? అవును అని సమాధానం రాగానే వెంటనే ఇంతకీ ఏ పార్టీలోకి వెళ్లనున్నారు? అని దాని ఫాలో అప్ క్వశ్చన్ రావదం సహజం. అయితే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆ నేత దగ్గర లేదు. టీడీపీ కాకుండా వేరే పార్టీల దగ్గరే ఉంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమామాధవ్రెడ్డి శుక్రవారం మీడియాతో చిట్ చాట్ పెట్టారు. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తర్వాత నేతల చిట్చాట్లు రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ల కన్నా కూడా బాగా పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె టీడీపీ పార్టీ, తన భవిష్యత్తు గురించి స్పందించారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మునిగిన నావ అని ఆమె తేల్చేశారు. ఈ విషయం తనకే కాదు అందరికీ తెలిసిందే అని స్పష్టం చేశారు. అయితే తాను కాంగ్రెస్‌లోకి వెళుతున్నా అనే విషయంపై మాట్లాడుతూ తనను ఎవరూ పిలవకుండా, తనతో ఎవరూ మాట్లాడకుండా కాంగ్రెస్‌లోకి ఎలా వెళతానని ఎదురు ప్రశ్నించారు. నిజానికి తనతో ఎవరైనా చర్చించి నిర్థుష్టమైన హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌రెడ్డితో పాటే ఢీల్లీ ఫ్లైట్ ఎక్కేసేదాన్ని కదా అంటూ తనను పిలవడమే ఆలస్యం అన్నట్టు ఉన్నానని చెప్పకనే చెప్పేశారు. కాంగ్రెస్ నుంచి రేవంత్‌కు స్పష్టమైన హామీ వచ్చి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. తనకు అలాంటి హామీ ఏమీ లభించకుండా తానెలా జంప్ అవుతా? అంటూ ప్రశ్నించారు.
అక్కడితో ఆగని ఉమామాధవ్రెడ్డి… ఒకప్పుడు తనకు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఆహ్వానం వచ్చిందని అయితే అప్పట్లో తాను వెళ్లలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం తెరాస ఆహ్వానిస్తే వెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ ఆమె అనడం ఆశ్చర్యకరం. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ తెలుగుదేశం నాయకుల దయనీయ స్థితికి ఉమా మాధవ్‌రెడ్డి వ్యాఖ్యలు నిదర్శనం అని పేర్కొనవచ్చేమో… అంతేకాదు… పార్టీలు సిధ్ధాంతాల కన్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు, ఇతర పార్టీలు ఇచ్చే హామీలు మాత్రమే రాజకీయ నేతలు పార్టీలు మారడానికి కారణం అవుతున్నాయనే దానికి కూడా నిదర్శనమే.