ఇటీవల రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య కొంచెం సానుకూల వాతావరణం ఏర్పడటంతో దానిని నిలుపుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకొన్నట్లు వార్తలు వచ్చేయి. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్వహించబోయే చండీయాగానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య వెల్లివిరుస్తున్న ఈ స్నేహభావం చూసి అందరూ హర్షిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మారిన తీరుతో తెలంగాణాలో తెదేపా నేతల పరిస్థితి కుడితో పడ్డ ఎలుకలా తయారయింది.
ఇంతవరకు వారు తెరాస ప్రభుత్వంతో దాని ముఖ్యమంత్రి కేసీఆర్ తో చాలా భీకర యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు తమ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తుంటే, తాము కేసీఆర్ తో ఏవిధంగా యుద్ధం కొనసాగించాలో తెలియక తికమక పడుతున్నారు. ఒకవేళ తాము యుద్ధం చేసినప్పటికీ తెలంగాణా ప్రజలు దానిని నమ్మకపోవచ్చును. అలాగని తెరాసతో చేతులు కలపడం కూడా అసాధ్యం. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లుగా, చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య మొదలయిన ఈ స్నేహం తెలంగాణా తెదేపా నేతలకు రాజకీయ సంకటంగా మారింది.
వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా సరిగ్గా ఇదే ప్రశ్న లేవనెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మకయ్యినందునే బీజేఫై అభ్యర్ధి తరపున తెదేపా నేతలు గట్టిగా ప్రచారం చేయడం లేదని ఆమె ఆరోపించారు. తెదేపా-తెరాసలు కుమ్మక్కు అయినట్లు ఇంత స్పష్టంగా కనబడుతుంటే, తెరాసతో వైకాపా కుమ్మకు అయిందని వారే తిరిగి తమపై ఆరోపణలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. “తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వైకాపా అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తున్నారు కానీ తెదేపా-బీజేపీల ఉమ్మడి అభ్యర్ధి తరపున ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు రావడంలేదని” వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నకి తెదేపా నేతల వద్ద జవాబు లేదు.
ఈ ఎన్నికలలో తెరాస గెలుపుకి తెదేపా, వైకాపాలు రెండు కూడా ఈవిధంగా పరోక్షంగా సహాయసహకారాలు అందించడం చూస్తుంటే “కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లుంది. ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్య జైలు పాలవడం, ఆయన స్థానంలో వరంగల్ ప్రజలకు బొత్తిగా పరిచయంలేని సర్వే సత్యనారాయణ ఎంట్రీ ఇవ్వడం, బీజేపీ చాలా బలహీనమయిన అభ్యర్ధిని పోటీలో నిలబెట్టడం, ఆయనకి తెదేపా అండదండలు లోపించడం, తెరాసని గెలిపించడం కోసమే వైకాపా పోటీ చేస్తుండటం వంటివన్నీ చూస్తుంటే, తెరాస అభ్యర్ధిని ఏకగ్రీవంగా ఎన్నుకొంటునట్లుంది తప్ప పోటీ జరుగుతున్నట్లు లేదు.