అయిపోయింది.. తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ప్రాతినిధ్యం.. మరీ దారుణమైన స్థితికి పడిపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ పేరు చెప్పుకుని సభలో మిగిలిన తెదేపా ఎమ్మెల్యేలు కేవలం అయిదుగురు మాత్రమే కాగా, అందులో ఇద్దరు వెళ్లిపోవడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈనెల 11వ తేదీన తెరాసలో చేరడానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, మాధాపూర్ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ముహూర్తం ప్రకటించేశారు.
నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనంతరం తెరాస ప్రారంభించిన ఆకర్ష పథకం సెకండిన్నింగ్స్లో ఈ ఇద్దరు కూడా గులాబీ పార్టీలోకి వెళ్లిపోతారని తొలినుంచి పుకార్లు వచ్చాయి. అయితే ఆ ఇద్దరూ ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చారు. మాగంటిగోపీనాధ్.. హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కూడా! ఆయన సూటిగా తనకు ఎలాంటి ఆఫర్లు లేవని, పార్టీ మారడం లేదని సెలవిచ్చారు. గాంధీ కూడా ఇంచుమించు అలాంటి డైలాగులే వేశారు. కానీ ఓ నెల గడిచేసరికెల్లా.. వారిద్దరూ కూడా తెరాసలో చేరిపోతున్నారు. నిజానికి వారిద్దరూ తమని కూడా తెరాస సభ్యులుగా గుర్తించాలని కోరుతూ స్పీకరుకు లేఖ రాసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి.
దీంతో సభలో తెదేపా సభ్యుల సంఖ్య 3కు పడిపోయినట్లే. వారిలో ఒకరు అంటే ఆర్.కృష్ణయ్య ఆటలో అరటిపండు లాంటి వారు. నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని ఆయన బాహాటంగానే ప్రకటిస్తూ ఉంటారు. ఇక మిగిలినది ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరూ ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులు… రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య మాత్రమే. మరి సండ్ర వెంకట వీరయ్య మీద కూడా పార్టీ మారుతారనే పుకార్లు ఉన్నాయి. అదికూడా జరిగితే రేవంత్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యే అవుతారేమో చూడాలి!