తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విపక్షాల విమర్శల పదును పెరుగుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ వైఫల్యంపై ఇప్పటికే తీవ్ర విమర్శలువస్తున్నాయి. నవంబర్ 26 లోగా ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని టీడీపీ డెడ్ లైన్ విధించింది. లేకపోతే లక్ష మందితో సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ హెచ్చరించారు.
లక్షల మంది విద్యార్థుల చదువుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శిస్తున్నాయి. ఫీజు బకాయిలు ఇవ్వకపోతే కాలేజీలను నడిపేది ఎట్లా అని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. వాటి ఆందోళనలో న్యాయం ఉంది. ఈ అంశంపై టీడీపీ మంగళవారం ఎల్ బి నగర్ లో మహాధర్నా నిర్వహించింది. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది.
కేసీఆర్ విషయంలో టీడీపీ వైఖరి కరుకుదేలినట్టు కనిపిస్తోంది. ఆయనపై రమణ సెటైర్లు వేశారు. బతుకమ్మ పేరుతో కోట్లు ఖర్చు చేసి తన కూతురు కవితను కేసీఆర్ విదేశాలకు పంపారని రమణ విమర్శించారు.
ఈసారి విదేశాలకు పంపారు. వచ్చే ఏడాది చంద్రమండలంలో బతుకమ్మ ఆడవమ్మా అని పంపుతారేమో అని చెణుకులు విసిరారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారి భవిష్యత్తుతో ఆడుకోవడమే అని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుందని కేసీఆర్ ను హెచ్చరించారు.
ఫీజు బకాయిల్లో ప్రస్తుతానికి 300 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ఒకవిధంగా ప్రయివేటు కాలేజీల యజమానులను బతిమిలాడుకుంది. ఇటీవల జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ప్రతిపాదన చేశారు. ప్రస్తుతానికి కాలేజీల యమజానులు సరేనన్నారు. కానీ మిగతా బకాయిలు బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు.