ఎట్టకేలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పోరాటాలు చేస్తామంటూ సిద్ధమౌతున్నారు..! ఓపక్క, ముందుస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయన్నట్టుగా రాష్ట్రంలో వాతావరణం ఉంది. ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ సభలూ సమావేశాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఉన్న అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ సర్కారుపై పోరాటం అంటూ తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత చట్టంలోని హామీలను కేంద్రం నుంచి సాధించుకోవడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందనీ, ఈ అంశాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు టీ టీడీపీ సిద్ధమౌతుండటం విశేషం!
రిజర్వేషన్ల సాధనతోపాటు, గిరిజన యూనివర్శిటీ స్థాపించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతపెద్దిరెడ్డి విమర్శించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే అంశాన్ని ముఖ్యమంత్రి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, కేంద్రం నుంచి ఉక్కు కర్మాగారం సాధించుకునే అంశంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. అందుకే, చలో బయ్యారం అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రారంభిస్తోందన్నారు. దీని తరువాత, విభజన చట్టంలో ఉన్న ఒక్కో హామీపైనా వరుసగా ఫోకస్ పెడతారని టీ టీడీపీ నేతలు అంటున్నారు. ముందుగా చలో బయ్యారం, ఆ తరువాత కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ సాధన దిశగా పోరాటం చేస్తామంటున్నారు. కేంద్రం నుంచి రాబట్టాల్సిన అన్ని విషయాల్లో తెలంగాణ సర్కారు విఫలమైందన్న అంశాన్ని ఫోకస్ చేస్తామంటున్నారు.
నిజానికి, ఆంధ్రాలో మాదిరిగా తెలంగాణలో విభజన చట్టంలోని అంశాల అమలుపై ప్రజల్లో కూడా పెద్దగా ఫోకస్ లేదు. కేంద్రం ఇస్తోందా లేదా, ఇస్తామని అన్యాయం చేసిందా, తెస్తామని తెరాస తేలేకపోయిందా… చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వకుండా అన్యాయం చేస్తోందా అనే చర్చ తెలంగాణలో ఇంతవరకూ పెద్దగా జరగలేదు. ఆ అవసరం రాలేదనే చెప్పాలి! ఎందుకంటే, విభజన తరువాత అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి బాటలోనే పయనిస్తోంది. నిధులు పుష్కలంగా ఉన్నాయి. భారీ ఎత్తున ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టింది. బడ్జెట్ కి ఎలాంటి లోటూ లేదు. కేంద్రం ఇచ్చిందా.. ఇవ్వకపోవడం వల్ల ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతోందా అనే అంశం ప్రజలను ప్రభావితం చేసేంత స్థాయిలో తెలంగాణలో చర్చ లేనే లేదు. మరి, అలాంటి అంశంతో టీ టీడీపీ పోరాటం ప్రారంభమౌతుందని అంటున్నారు! ప్రజల నుంచి దీనికి ఆశించిన స్థాయిలో స్పందన వస్తుందంటే అనుమానంగానే ఉంది..!