తెలంగాణా విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి తన శాఖకి సంబంధించిన రెండు వ్యవహారాలపై ఈరోజు మౌనం వీడారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారం గురించి మాట్లాడుతూ, “దానిపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరు దోషులుగా తేలినా వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకొంటారు. నాపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. వైస్-ఛాన్సిలర్ల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేస్తాము,” అని చెప్పారు.
ఎంసెట్ లీకేజీ వ్యవహారం బయటపడకుండా ఆయనే దాచిపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున ఎంసెట్ పేపర్ల లీకేజ్ కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అటువంటప్పుడు ప్రతిపక్షాలకి సూటిగా సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. ఈ వ్యవహారంలో ఎవరు తప్పు చేసినా వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకొంటారని కడియం చెప్పారు. అంటే ఒకవేళ అయనని లేదా మరెవరినైనా పదవిలో నుంచి తప్పిస్తే వారే ఈ కేసులో దోషులని భావించవలసి ఉంటుందన్నమాట.
ఇక వైస్-ఛాన్సిలర్ల నియామకంపై ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ.ని హైకోర్టు తప్పు పడుతున్నప్పుడు, మళ్ళీ సుప్రీం కోర్టు వెళ్ళాలనుకోవడం పొరపాటే కావచ్చు. ఎందుకంటే వైస్-ఛాన్సిలర్ల నియామకంలో యు.జి.సి.నిబంధనలు పాటించడం తప్పనిసరి. కానీ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన జీ.ఓ. వాటికి విరుద్దంగా ఉన్నట్లు హైకోర్టు చెపుతోంది. కనుక సుప్రీం కోర్టుకి వెళ్ళినా అక్కడా భంగపాటు దాని వలన మరింత అవమానం ఎదుర్కోవలసి రావచ్చు. కనుక సుప్రీం కోర్టు వెళ్ళాలనే నిర్ణయంపై పునరాలోచించుకొంటే మంచిదేమో?