తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. పాత సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లన్నింటినీ తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని తేల్చేసింది. కోర్టు తీర్పు ఇలా రాగానే.. అలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే పాత సచివాయాన్ని ఖాళీ చేశారు. బీఆర్కే భవన్లో శాఖాధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. మిగిలి ఉన్న వారిని కూడా.. నేడో..రేపో తరలిస్తారు. ఇక అందులోకి ఎవర్నీ వెళ్లనివ్వరు. బహుశా కూల్చివేత ప్రక్రియ కూడా.. వారంలోపే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణకు కొత్త సచివాలయాన్ని సమకూర్చి పెట్టాలనేది సీఎం కేసీఆర్ పట్టుదల. ఆయన ఆరేళ్ల కిందట సీఎం అయినప్పటి నుండి ఈ ఆలోచన చేస్తున్నారు. అనేకానేక కసరత్తులు చేశారు. బైసన్ పోలో గ్రౌండ్ నుంచి ఎర్రగడ్డ ఆస్పత్రి స్థలం వరకూ.. ఎన్నో ప్రాంతాలను పరిశీలించారు. చాలా వాటిని దాదాపుగా ఫైనల్ చేశారు. కానీ.. అనేకానేక అడ్డంకులు వచ్చాయి. చివరికి ఏ స్థలమూ ఫైనల్ కాలేదు. అదే సమయంలో.. ఉన్న సెక్రటేరియట్ స్థలంలో కడదామంటే… మూడు భవనాలు ఏపీ ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం మారడంతో.. కొత్త సీఎం జగన్.. ప్రమాణస్వీకారం చేయకుండానే ఆ భవనాలను.. తెలంగాణకు రాసిచ్చేశారు . దాంతో అన్నింటినీ కూలగొట్టి.. కొత్త వాటిని నిర్మించాలని నిర్ణయించారు. మంచి ముహుర్తం చూసుకుని శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. తర్వాత కోర్టుల్లో కేసులు పడ్డాయి. ఇప్పటికి క్లారిటీ వచ్చింది.
తెలంగాణ కొత్త సెక్రటేరియట్.. అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ప్రఖ్యాత కాంట్రాక్టర్ల వద్ద నుంచి డిజైన్లు సేకరించారు. వాటిలో ఒకటి ఫైనల్ చేశారని కూడా చెబుతున్నారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. రేపోమాపో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే.. శంకుస్థాపన చేసినప్పటికీ.. ఇప్పటికీ.. ఓ కొత్త సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఈ సారి మాత్రం.. ఎలాంటి అడ్డంకులు లేకుండా.. నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఉంది.