తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే.. ఇప్పుడు ఉన్న సడలింపుల కన్నా మరిన్ని సడలింపులు ఇవ్వనున్నారు. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. లాక్ డౌన్ 4.0 నెలాఖరుతో ముగియనుంది. కేంద్రం కూడా… ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. లాక్ డౌన్‌ను లాంఛనంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుని సడలింపుల అధికారాలన్నీ రాష్ట్రాలకే కట్టబెట్టబోతున్నారు. దీంతో రాష్ట్రాల నిర్ణయమే కీలకం కానుంది. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా పగటి పూట సడలింపులు ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం సరి బేసి విధానంలో షాపులు తెరిచేందుకు అనుమతించారు. సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం కేసులు గ్రేటర్ లోనే నమోదవుతున్నాయి.హైదరాబాద్ లో కొత్త ప్రాంతాలకు కూడా కేసులు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సరి బేసి విధానాన్ని ఇలాగే మరి కొంత కాలం కొనసాగించాలా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ కొనసాగించినా.. ఎక్కువ సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.
బట్టల దుకాణాలు.. బంగారు దుకాణాలు.. మాల్స్ కు… నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జూన్ రెండో తేదీన రాష్ట్రావతరణ వేడుకలు విషయం ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయానికి రాలేదు. సింపుల్‌గా… భౌతిక దూరం పాటిస్తూ… జాతీయ జెండాల ఎగురవేత కార్యక్రమంతో పనిపూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.