తెలంగాణలో లాక్ డౌన్‌ను కేసీఆర్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం మూడో తేదీ వరకూ.. లాక్‌డౌన్‌ను పొడిగించగా.. కేసీఆర్ మాత్రం.. ఏడో తేదీ వరకూ పొడిగించారు. కరోనాను కంట్రోల్ చేయడానికి ఆ మాత్రం లాక్ డౌన్ ఉండాలని ఆయన భావించారు. ప్రస్తుతం తెలంగాణలో కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా కంటెయిన్మెంట్ జోన్లు లేవు. పాత జోన్లలో పధ్నాలుగు రోజుల వరకూ కేసులు లేకపోతూండంటో వాటిని తొలగిస్తున్నారు. దీంతో.. లాక్ డౌన్ ఎత్తివేస్తారేమోనన్న అభిప్రాయం.. ప్రజల్లో ఏర్పడింది. కనీ కేసీఆర్ మాత్రం ఎలాంటి చాన్స్ తీసుకోదల్చుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికీ కరోనా ముప్పు ఉందని.. లాక్ డౌన్ కొనసాగించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే.. ఈ సారి మినహాయింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో.. వ్యాపారాలు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో మద్యం దుకాణాలను ఇటీవలే వేలం వేశారు. భారీ రేట్లకు వాటిని పాడుకున్నారు. ఈ కారణంగా మద్యం దుకాణదారులకు.. ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం పడిపోయింది. కేంద్రం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ సర్కార్.. ఈ రోజు నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభించింది. తెలంగాణలోనూ.. మద్యం అమ్మకాలు ప్రారంభించాలేన ఆలోచన ఉన్నట్లుగా చెబుతున్నారు.
అయితే ఏపీలో లా కాకుండా.. పక్కాగా.. భౌతిక దూరం నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సర్కార్.. నలభై రోజులుగా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. దీంతో చిరు వ్యాపారులు.. ఇబ్బందులు పడుతున్నారు. వీరందర్నీ మళ్లీ గట్టెక్కించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చిన సర్కార్.. మంగళవారం కేబినెట్ భేటీలో మరిన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.