తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎన్నికల్లో పోటీ చేసేందుకు గవర్నర్ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారు. గవర్నర్ పదవి వచ్చే వరకూ ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమెను గవర్నర్ గా పంపి మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైకు చాన్సిచ్చారు. బీజేపీ కాస్త పుంజుకుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తమిళిసై భావిస్తున్నారు. ఈ విషయంపై అనుమతి తీసుకుని గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కోరేందుకు ఢిల్లీ వెళ్తున్నారు.
తమిళిసై తెలంగాణకు మాత్రమే కాకుండా పుదుచ్చేరి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ గవర్నర్ పదవికి సీఎం కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయి. అయినా గవర్నర్ గా ఉండటం కన్నా ఎంపీగా గెలవాలన్న లక్ష్యంతో ఆమె ఉన్నారు. గతంలో ఆమె ఎప్పుడూ ఎన్నికల్లో గెలవలేదు. మూడు సార్లు అసెంబ్లీకి. రెండు సార్లు పార్లమెంట్ కు పోటీ చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తూత్తుకూడిలో కనిమొళిపై పోటీ చేసిన ఒక్క సారి మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. అయినా గవర్నర్ పదవిని త్యాగం చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు.
అయితే గవర్నర్ గా .. తమిళిసైను తప్పించాలన్నది హైకమాండ్ నిర్ణయమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆమెను తప్పించి… తెలంగాణకు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ను నియమనించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణలో పది పార్లమెంట్ సీట్లను గెల్చుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది.