గత కొంత కాలంగా టాలీవుడ్ నిర్మాతల వర్గాల్లో ఓ గుసగుస వినిపిస్తోంది. నిర్మాత సురేష్ బాబు, నైజాం కీలక డిస్ట్రిబ్యూటర్ సునీల్ తదితరులు కలిసి, ఎలాగైనా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి, పార్కింగ్ ఫీజులు మళ్లీ వచ్చేలా ప్రయత్నిస్తున్నారన్నది ఆ గుసగుసల సారాశం. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో పార్కింగ్ చార్జీలను ప్రభుత్వం తీసేసింది. దీనిపట్ల జనం, ముఖ్యంగా తరచు మాల్స్ కు, థియేటర్లకు వెళ్లే యువత చాలా అంటే చాలా హ్యాపీగా వున్నారు. అయితే కొందరు ఇంకా దొడ్డిదారిన వసూలు చేస్తూనే వున్నారు. ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది.
ఉదాహరణకు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర టూ వీలర్స్ కు ఇప్పటికీ పార్కింగ్ వసూలు చేస్తూనే వున్నారు. అసలు ప్రసాద్ ఐ మాక్స్ లో కార్ పార్కింగ్ తప్ప టూ వీలర్ పార్కింగ్ లేదు. ఇప్పుడున్నది ప్రయివేట్ పార్కింగ్. దాంతో థియేటర్ కు సంబంధం లేదు అంటున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. మరి థియేటర్లో టూ వీలర్ పార్కింగ్ ఏదీ అని ఎవ్వరూ అడగరు. ప్రభుత్వం పట్టించుకొదు.
ఇలాంటి నేపథ్యంలో థియేటర్లలో పార్కింగ్ తీసేయడం వల్ల వాటిని లీజుకు తీసుకున్న వారికి నష్టంగా వుంది. ముఖ్యంగా తెలంగాణలో థియేటర్లు అన్నీ సురేష్ బాబు-ఆసియన్ సునీల్ చేతిలో వున్నాయి. నూటికి తొంభై తొమ్మిది థియేటర్లు వారివే. అందువల్ల ప్రభుత్వంతో తమకు వున్న సంబంధాలను వాడుకుని, పార్కింగ్ ఫీజులు మళ్లీ వచ్చేలా పావులు కదుపుతున్నారని దాదాపు రెండు మూడు నెలలుగా వినిపిస్తోంది.
ఇప్పుడు సురేష్ బాబు సంబంధీకులు అని ఇండస్ట్రీలో పేరున్న జెమినీ కిరణ్, ఆసియన్ సునీల్ తదితరులు తెలంగాణ ఫెడరేషన్ తో కలిసి మీటింగ్ పెట్టి, ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనివల్ల థియేటర్లకు నష్టం వస్తోందని బాధపడ్డారు. ఇదంతా రివర్స్ లో జరుగుతున్న వ్యవహారం అని ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇప్పటికే పార్కింగ్ చార్జీలు మళ్లీ విధించేలా, ప్రభుత్వాన్ని చాలా వరకు ఒప్పించారని, అయితే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ప్రతిపాదన, విన్నపం అందించి, ఆపైన సానుకూలంగా నిర్ణయం వచ్చేలా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
కానీ ఏమయినా పార్కింగ్ చార్జీలు తీసేయడం వల్ల ప్రజలు హ్యాపీగా వున్నారు. తెరాస ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు తీసుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అసలే ఎదట ఎన్నికలు వున్నాయి. ఇలాంటి టైమ్ లో కొంతమంది కారణంగా ప్రభావితమై మళ్లీ పార్కింగ్ చార్జీలు ప్రవేశపెడుతుందా? అన్నది అనుమానం.